కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పూర్తి..

by Disha Web Desk 11 |
కళాతపస్వి కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పూర్తి..
X

దిశ, జూబ్లిహిల్స్: టాలీవుడ్‌ ప్రముఖ అగ్ర దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 1:40 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై ఫిల్మ్ నగర్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు కొనసాగి పంజాగుట్ట శ్మశానవాటికలో మధ్యాహ్నం 3 గంటలకు సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య విశ్వనాథ్ బౌతికకాయానికి అంతిమసంస్కారాలు ముగిశాయి.

కళాతపస్వి కె విశ్వనాథ్..

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు విశ్వనాథ్.

దర్శకుడిగా మొదటి సినిమా..

1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్‌ కంప్లీట్‌ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. అక్కినేని నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు.

గుర్తింపు తెచ్చిన సినిమాలు..

ఆయన సినీ జీవితంలో గుర్తింపు తెచ్చిన చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి.

విశ్వనాథ్ ను వరించిన పురస్కారాలు..

దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నాడు. 1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు.

పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు..

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, హాస్య నటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ త్రివిక్రమ్, నటుడు తనికెళ్ల భరణి, సాయికుమార్, ఎస్వీ కృష్ణ రెడ్డి, అల్లు అరవింద్, ఎల్బీ శ్రీరాములు, బోయపాటి శ్రీనివాస్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, సుదర్శన్, శివ పార్వతి, చంద్ర మోహన్ , నిర్మాత తమ్మారెడ్డి, ఆలి, ఆర్.నారాయణ మూర్తి, గుణ శేఖర్, కోట శ్రీనివాస్ రావు, కరాటే కళ్యాణి, కాజా సూర్యనారాయణ, ఆర్ .నారాయణ మూర్తి, నందమూరి రామకృష్ణ, రాఘవేంద్రరావు , నాజర్ జూబ్లిహిల్స్ కార్పొరేటర్ వెల్డండ వెంకటేష్ , ఆర్టిస్టులు తదితరులు కే.విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ మీట్ లో విశ్వనాథ్ మరణం పట్ల తమలోని బాధను వ్యక్తపరిచారు.

మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకులను సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి.

తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో: మెగాస్టార్ చిరంజీవి

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నా. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. ఆయన కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈ రోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా.

కె.విశ్వనాథ్ తో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం..

కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు. నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన 'శభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి, ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సినిమాలుగా నిలిచిపోయాయి.

విలువలు తెలిసేలా చేశాయి: పవన్‌ కల్యాణ్

విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఎక్కువగా యాక్షన్ సినిమాలు ఇష్టపడే నాకు స్వాతిముత్యం, శంకరాభరణం లాంటి సినిమాలు తెలుగు సినిమా, సాహిత్యం, మన సాంస్కృతి పై విలువలు తెలిసేలా చేశాయి.

ఆయనతో సినిమా చేసే భాగ్యం నాకు కలిగింది: అల్లు అరవింద్‌

చిన్న వయసులోనే ఆయనతో సినిమా చేసే భాగ్యం నాకు కలిగింది. షూటింగ్‌ సమయంలో నన్ను పిలిచి చాలా విషయాలు చర్చించేవారు. అంతకుముందెప్పుడూ అలా ఎవరితోనూ చర్చించలేదని జంథ్యాల ఆశ్చర్యపోతూ నాతో చెప్పారు. ఒక సీన్‌లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సరిగా చేయలేకపోతున్నారు. నలుగురు వ్యక్తులు కనపడే ఆ సన్నివేశాన్ని విశ్వనాథ్‌గారు అన్ని పాత్రల్లోనూ నటించి చూపించారు. చిరంజీవిగారితో ఆయనకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన ఎక్కడున్నా చిత్ర పరిశ్రమను దీవించాలని కోరుకుంటున్నా.

లెజెండరీ డైరెక్టర్‌ విశ్వనాథ్‌: విక్టరీ వెంకటేశ్‌

లెజెండరీ డైరెక్టర్‌ విశ్వనాథ్‌గారు లేరంటే నిజంగా షాకింగ్‌గా ఉంది. దేశంలో ఉన్న గొప్ప దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. స్వర్ణకమలం సినిమా సందర్భంగా ఎన్నో విషయాలు నేర్పారు. ఈ జనరేషన్‌ మాత్రమే కాదు, భవిష్యత్‌ తరాలు కూడా ఆయన సినిమాను గుర్తు పెట్టుకుంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

అన్ని సాధించి పరిపూర్ణమైన కళాతపస్వి: తనికెళ్ల భరణి

జీవితంలో సాధించాల్సినవి అన్ని సాధించి పరిపూర్ణమైన కళాతపస్వి. నేను ఆయనతో కలిసి నటించాను.చాలా సరదా మనిషిని. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు ఆయన చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.

ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది: పరుచూరి గోపాలకృష్ణ

ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. ఫిబ్రవరి 2న 'శంకరాభరణం' విడుదలైన రోజునే ఆయన కన్నుమూయడం చూస్తే, ఒక గొప్ప సినిమాను మనకు అందించి సంతృప్తితో వెళ్లిపోయారనిపించింది. ఆయనతో సినిమా చేయాలని రెండు, మూడు సార్లు కథ వినిపించా. మా ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లు వేరు. మేము రాసిన కథలకు ఆయన దర్శకత్వం వహించకపోయినా, నటించారు. 'నరసింహనాయుడు'లో ఆయన పాత్రను జీవితంలో మర్చిపోలేం. ఆ సినిమా స్క్రీన్‌ప్లే విషయంలోనూ పలు సలహాలు ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి కన్నుమూయడం నిజంగా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

గొప్ప దర్శకుడిగా కీర్తి: ఇళయరాజా

ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలో గొప్ప దర్శకుడిగా కీర్తిని పొందిన కె.విశ్వనాథ్‌గారు కన్నుమూశారన్న వార్త నన్ను ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు చేకూరాలని ప్రార్థిస్తున్నా.

ఆయన గొప్ప విజనరీ డైరెక్టర్‌: గుణశేఖర్

మాటలు కనపడాలి అన్న దర్శకత్వ ప్రాథమిక సూత్రం ఆయన సినిమాల్లో ప్రస్పుటంగా కనిపిస్తుంది. మాలాంటి వాళ్ల మీద ఆయన ప్రభావం బాగా ఉంది. సినిమా ఒక గొప్ప కళ అని ఆయన నిరూపించారు. ఆయన ఎప్పుడూ మన మధ్య సజీవంగా ఉంటారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పుస్తకం. శంకరాభరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసిన ప్రతిసారి దాని దృక్కోణం మారిపోతుంది. ఎంతో లోతుగా మహాసముద్రంలా కనిపిస్తుంది. ప్రతి తరం దర్శకులకు అది స్ఫూర్తి. ఆయన గొప్ప విజనరీ డైరెక్టర్‌.


Next Story

Most Viewed