తల్లి పాలు కావలెను.. రాష్ట్రంలో పెరిగిన వినియోగం

by  |
Mother Milk Center
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తల్లి పాలు అవసరమయ్యే శిశువుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. బిడ్డ పుట్టగానే తల్లి చనిపోవడం, అనారోగ్యంతో ఆసుపత్రులు పాలైన శిశువుకు తల్లి దూరంగా ఉండటం, తల్లి బలహీనంగా ఉండి సరైన మోతాదులో పాలు రాకపోవడం వంటి కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డకు తల్లి పాలు కరువవుతున్నాయి. కరోనా తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎక్కువైనట్టు గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నదని, ఇది అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ కూడా ఇటీవల హెచ్చరించింది. ఈ సమస్యను అధిగమించాలని, లేదంటే భావిభారత పౌరులకు తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వాలకు సూచించింది.

దీంతో తెలంగాణలో కొత్తగా 3 మదర్ మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటిని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఒక్కో సెంటర్‌ను రూ.34.44 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా తల్లి లేని పిల్లలకు పాలను అందించాలని ఆరోగ్యశాఖ సిద్ధమైనది. ఇప్పటికే నిలోఫర్ ఆసుపత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా మదర్ మిల్క్ సెంటర్ నడుస్తుండగా, పెట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ‌, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌ హాస్పిటల్స్‌లో కొత్త మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. వీటి స్పందన బట్టి అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన కూడా ఉన్నదని ఆరోగ్యశాఖకు చెందిన ఓ కీలక అధికారి ‘దిశ’కు తెలిపారు.

వివిధ రకాల రుగ్మతలకు చెక్

ప్రతీ శిశువుకు తల్లిపాలు ఎంతో అవసరం. ఇమ్యూనిటీ పెంచుకొని వివిధ రకాల రుగ్మతల నుంచి దూరంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. అలర్జీలు, శ్వాససమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, జీర్ణకోశాలు, కంటి, చెవి, రక్తసరఫరా ఆటంకాలు వంటివి రాకుండా సురక్షితంగా ఉండొచ్చు. అంతేగాక తల్లి నుంచి బిడ్డకు ప్రోటీన్లు, యాంటీబాడీలు వంటివి తల్లి పాలను తీసుకోవడం వలన పుష్కలంగా లభిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే మిల్క్ సెంటర్లలో తల్లి పాలు సేకరించేందుకు, స్టోరేజ్ చేసేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచుతారు. సేకరించిన పాలను తల్లిపాలకు తీసుకోలేని శిశువులకు అందివ్వనున్నారు. బాలింతలు ఎవరైనా ఆయా సెంటర్లలో స్వచ్ఛందంగా పాలు దానం చేసే వెసులుబాటును కల్పించనున్నారు. శిశువుల నుంచి దూరంగా ఉన్న తల్లులు కూడా ఈ కేంద్రాలకు వచ్చి మిల్క్ ఇవ్వొచ్చు. మరోవైపు తల్లి ఎప్పడికప్పుడు పాలను ఇవ్వడం వలన బ్రెస్ట్ క్యాన్సర్, ఇండోమెట్రో సిండ్రోమ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చని డాక్టర్లు వివరిస్తున్నారు.

పుట్టినప్పుడే తల్లిపాలను అలవాటు చేయాలి

Dr Manjula Anagani

పుట్టినప్పుడే బిడ్డకు తల్లిపాలను తప్పనిసరిగా అలవాటు చేయాలి. అయితే కొందరి తల్లులకు సరైన శాతంలో పాలు రావు. డెలివరీ తర్వాత ప్రోజెస్టాన్ తగ్గి, ప్రోలాక్టిన్ పెరుగుతుంది. దీంతో పాలు ఉత్పత్తి అయినా ఆక్సిటోసిన్ ప్రభావంతో శిశువుకు సరిపోయేంతా పాలు బయటకు రావు. అంతేగాక డెలివరీ సమయంలో అధిక రక్త స్రావం జరిగినప్పుడు సరైన శాతంలో పాలు ఉత్పత్తి కావు. దీంతో పాటు ప్రిట్యూటరీ గ్రంధీలో ఇన్ ఫెక్షన్ ఉన్నా హార్మోన్ల లోపంతో మిల్క్ విడుదల కావు. ఇలాంటి సమయంలో మదర్ మిల్క్ సెంటర్లలో లభించే పాలు చిన్నారులకు ఎంతో ఉపయోగపడతాయి.
-డాక్టర్ మంజులా అనగాని, ఉమెన్, చైల్డ్ యూనిట్ క్లినికల్ డైరెక్టర్


Next Story

Most Viewed