బూత్‌ బంగ్లాలో కోట్లు విలువ చేసే పత్రాలకు ప్రమాదం

by  |
బూత్‌ బంగ్లాలో కోట్లు విలువ చేసే పత్రాలకు ప్రమాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోజంజాహి మార్కెట్​నుంచి గోషామహల్‎కి వెళ్లే దారిలో రెండో కుడి వైపునకు తిరగాలి. కొద్ది దూరం వెళ్లగానే కుడివైపున పెద్ద బూత్​బంగ్లా కనిపిస్తోంది. దానికి ముందు రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్​విభాగం(తూర్పు) రాజస్వ మండలాధికారి/సబ్​డివిజనల్​మెజిస్ట్రేట్​కార్యాలయం అని పెద్ద బోర్డు స్వాగతం పలుకుతోంది. కానీ ఆ ఆఫీసుకి ఎవరూ రావడం లేదు. ఒకటీ రెండు రోజులుగా కాదు. నాలుగేండ్లుగా ఆ కార్యాలయం మూతపడింది. ఇప్పుడా కార్యాలయమే మనుగడలో లేదు. అది విడిపోయి నాలుగు రెవెన్యూ డివిజన్లుగా మారింది.

కీసర, మల్కాజిగిరి డివిజన్లు 2014లో ఏర్పడ్డాయి. ఆ తర్వాత నాలుగేండ్ల క్రితం ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లు ఆవిర్భవించాయి. కానీ అత్యంత విలువైన రెవెన్యూ రికార్డులు, కీలకమైన దస్త్రాలన్నీ ఇక్కడే భద్రపరిచారు. కీసర, మల్కాజిగిరి డివిజన్ల దస్త్రాలను ఆయా కార్యాలయాలకు తరలించారు. కానీ ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల ఫైళ్లు మాత్రం నేటికీ ఇక్కడే ఉంచారు. కార్యాలయాలు మాత్రం ఆయా డివిజన్​హెడ్​క్వార్టర్స్‌లోనే ఏర్పాటు చేశారు. కానీ ఫైళ్లు మాత్రం ఇక్కడే ఉంచడం విశేషం.

ఎలాగూ ఆన్​లైన్​సేవలందిస్తున్నామని అధికారులు భావిస్తున్నారు. పేపర్​లెస్​రెవెన్యూ పాలనను అందిస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఇక్కడి ఫైళ్లు ధ్వంసమైనా, నాశనమైనా, ఎవరైనా తస్కరించినా భూమి హక్కులకు పాతరేసినట్లవుతుందని రెవెన్యూ శాఖలో పని చేసిన వారే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసు నుంచి జూనియర్​అసిస్టెంట్, కందుకూరు ఆర్డీఓ ఆఫీసు నుంచి రికార్డు అసిస్టెంట్ మాత్రం అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఈ పాత కార్యాలయానికి వస్తున్నారు. ఎవరైనా సర్టిఫైడ్​కాపీల కోసం దరఖాస్తు చేసుకుంటే తప్ప ఈ ఆఫీసు వైపు కన్నెత్తి చూసే పని లేదు. ఓ నాల్గో తరగతి ఉద్యోగికి పూర్తి రక్షణ బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. కూలే స్థితిలో ఉన్న ఈ బంగ్లాను ఖాళీ చేయకుండా తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎలుకలు, పందికొక్కులు దర్శనమిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

అన్నీ విలువైనవే..

రంగారెడ్డి తూర్పు డివిజన్ అంటే అత్యంత ఖరీదైన భూములు ఉండే ప్రాంతమే. ప్రస్తుతం ఇందులోని రికార్డుల కలిగిన మండలాల్లో ఎకరం భూమి ధర రూ.20 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు పలుకుతోంది. భూ హక్కుల్లోనూ అనేక కేసులు, గొడవలు, దందాలు, వివాదాలు పెండింగులో ఉన్నాయి. ఇంకా అనేకం ధరణి పోర్టల్​లోనూ దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇనాం ఆర్డర్లు, ఓఆర్సీలు, ల్యాండ్ రీఫార్మ్స్ కు సంబందించిన అనేక దస్త్రాలు, భూ సేకరణ ఫైళ్లు, అవార్డు అందజేసిన రశీదులు.. ఒక్కటేమిటి అనేక రకాల వివాదాల పరిష్కారానికి తీసుకున్న వాంగ్మూలం, పంచనామా కాపీలు ఉన్నాయి. అలాంటి ఏ ఒక్కటి కనిపించకుండాపోయినా తలెత్తే సమస్యకు పరిష్కారాన్ని చూపించడం చాలా కష్టమని ఓ రెవెన్యూ రిటైర్డ్​అధికారి అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే సర్టిఫైడ్​కాపీలు అడిగితే దొరకడం లేదంటూ దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహింపట్నం రెవెన్యూ డివిజన్​లో హయత్​నగర్, అబ్దుల్లాపూర్​మెట్, ఇబ్రహింపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల మండలాలు, కందుకూరు రెవెన్యూ డివిజన్​లో సరూర్ నగర్, బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలు ఉన్నాయి. ఈ మండలాలన్నీ రియల్​ఎస్టేట్​భూం అందుకున్నవే. వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాంతాలివి. ధరణి పోర్టల్​అమలు తర్వాత మహేశ్వరం మండలంలోనే పట్టాదారుడికే తెలియకుండానే మరొకరికి రూ.కోట్ల విలువైన భూమి హక్కులు రాసేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టాదారులు ఎక్కడా సంతకాలు పెట్టలేదు. నిజానికి వారీ దేశంలోనే లేరు. అలాంటి వారి భూమిని మరో ఇద్దరి పేరిట రాసేసిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి పరిణామాలు చోటు చేసుకున్న దరిమిలా దాఖలయ్యే కేసుల్లో అసలైన పట్టాదారులకు న్యాయం జరగాలంటే పాత రికార్డులు కూడా అవసరమయ్యే అవకాశాలు ఏర్పడొచ్చు. ఇదే తరహా పాత భవనంలో ఎవరి స్వాధీనంలో లేకుండా ఉండే విలువైన ఫైళ్లకు ఎవరు రక్షణ కల్పిస్తారని ఓ రియల్టర్ ప్రశ్నించారు.

కిరాయి బిల్డింగ్ ​అంటూ..

ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్​కార్యాలయాలను కిరాయి భవనాల్లో కొనసాగిస్తున్నారు. అందుకే పాత రికార్డులను పాత ఆఫీసు భవనంలోనే ఉంచినట్లు రికార్డు అసిస్టెంట్​కె.శ్రీకాంత్​వివరణ ఇచ్చారు. అందుకే ఎవరైనా సర్టిఫైడ్​కాపీలు అడిగినప్పుడు తామే వెళ్లి తీసుకొస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్​తరఫున అక్కడ పని చేసే జూనియర్​అసిస్టెంట్​బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే అక్కడ ఎన్ని వేల ఫైళ్లు ఉన్నాయో చెప్పడానికి నిరాకరించారు. ఎవరు చార్జీ తీసుకున్నట్లుగా పేర్కొన్నారో కూడా తెలియదన్నారు. అవన్నీ తమ పై అధికారులను అడగాలన్నారు. ఇకనైనా విలువైన దస్త్రాలను కాపాడకపోతే రానున్న రోజుల్లో ఈ రెండు డివిజన్లలో తలెత్తే భూ సమస్యలకు పరిష్కారం కష్టమవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Next Story

Most Viewed