కరెంట్ ఉగ్యోగులపై కరోనా షాక్.. వ్యాక్సినేషన్ ఊసెత్తని సర్కార్

by  |
electrical workers
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరెంట్ ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఫస్ట్ వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య అధికంగా ఉంది. రెండో వేవ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు పడ్డారు. విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్లాలన్నా జంకుతున్నారు. తమ నుంచి తమ కుటుంబ సభ్యులకు ఎక్కడా కరోనా మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ మొత్తంలో కొవిడ్ బారిన పడటం ఉద్యోగులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఫస్ట్, సెకండ్ వేవ్ లను కలుపుకుని టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో 5,771 మంది కరోనా బారిన పడ్డారు. కాగా 3,670 మంది కోలుకున్నారు. 1,984 పాజిటివ్ కేసులుండగా పలువురు ఆస్పత్రుల్లో కరోనాపై పోరాటం చేస్తుండగా.. మరికొందరు హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 117 మంది విద్యుత్ ఉద్యోగులు మృత్యువాతపడ్డారు.

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

విద్యుత్ శాఖలో కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో 2600 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవ్వగా.. సెకండ్ వేవ్ లో ఆ సంఖ్య అమాంతం పెరిగింది. 3,171 మంది కొవిడ్ బారిన పడ్డారు. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ పరిధిలో విధులు నిర్వర్తించే 100 మందికిపైగా ఉద్యోగులకు పాజిటివ్ గా తేలింది. కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేసినప్పటికీ కరెంట్ ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో పడటానికి యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని పలువురు ఉద్యోగులు వాపోయారు. కరోనా నుంచి ఉద్యోగులను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేపడుతున్నామని యాజమాన్యాలు చెబుతున్న మాటలన్నీ ప్రగల్భాలేనని ఉద్యోగులు ఆరోపణలు చేయడం గమనార్హం.

వ్యాక్సినేషన్ ఊసే లేదు

విద్యుత్ శాఖలో ఫీల్డ్ వర్క్ కు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. వారి నుంచి ఇతరులకు వైరస్ సోకినా.. ఇతరుల నుంచి ఉద్యోగులకు వైరస్ సోకినా ప్రమాదమే. కాబట్టి తమను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి తమతో పాటు తమ కుటుంబసభ్యులందరికీ వ్యాక్సినేషన్ చేపట్టాలని ఉద్యోగులు యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లారు. మొదట్లో కొద్దిరోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగానే సాగినప్పటికీ నెమ్మదిగా మందగించింది. ఇప్పటి వరకు అతికొద్దిమందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఎన్పీడీసీఎల్ లో ఇప్పటి వరకు ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులను కలిపి కేవలం 400 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. ఎస్పీడీసీఎల్, ట్రాన్స్ కో, జెన్ కోలోనూ వ్యాక్సిన్ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంది.

117 మంది మృత్యువాత

తెలంగాణలో ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న ఉద్యోగులు 117 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో అత్యధికంగా ఎస్పీడీసీఎల్ లో 40 మంది మరణించారు. ఎన్పీడీసీఎల్ లో 32, జెన్ కో లో 36 మంది కొవిడ్ కారణంగా మృతిచెందారు. ఇదిలా ఉండగా ట్రాన్స్ కోలో తొమ్మిది మంది మరణించారు. ఎన్పీడీసీఎల్ లో 424 యాక్టివ్ కేసులున్నాయి. ఎస్పీడీసీఎల్ లో 963, జెన్ కోలో 313, ట్రాన్స్ కోలో 284 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తంగా 1,984 మంది కరోనాతో పోరాడుతున్నారు. ఇందులో కొందరు హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.

లెక్కలోకి రాని మీటర్ రీడర్లు, కార్మికులు

కొవిడ్ బారిన పడిన వారిలో విద్యుత్ అధికారులు చెప్పేదొకటి, చేసేదొకటని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి సంఖ్యను తక్కువ చేసి చెబుతున్నారని ఉద్యోగులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. పాజిటివ్ గా తేలిన వారిలో ఉద్యోగులు, ఆర్టీజన్లు, ఇంజినీర్ల వివరాలను మాత్రమే అందిస్తున్నారని, మీటర్ రీడర్లు, ఇతర కార్మికుల వివరాలు అందించడం లేదంటున్నారు. మీటర్ రీడర్లు, కార్మికులను కనీసం లెక్కల్లోకి కూడా చేర్చకపోవడం శోచనీయమని వారు చెప్పడం గమనార్హం. ఉద్యోగులు, కార్మికులు కొవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నా విద్యుత్ శాఖలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఉద్యోగులను కలవరపెడుతోంది.

యాజమాన్యాలు చెప్పేవి ఒట్టి ముచ్చట్లే..

కొవిడ్ కేసులు విషయంలో యాజమాన్యాలు చెప్పేవన్నీ ఒట్టి ముచ్చట్లే. అన్ని జాగ్రత్త చర్యలు చేపడితే సెకండ్ వేవ్ లో కేసులెందుకు పెరుగుతాయి. ఫీల్డ్ వర్క్ చేసే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎక్కడ కరోనా సోకుతుందోనని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ అందించాలి. విద్యుత్ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి. – నాగరాజు, తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనివయన్(వీడబ్ల్యూ-2871) వ్యవస్థాపక అధ్యక్షుడు

శాఖలవారీగా వివరాలు

ఎన్పీడీసీఎల్ లో
మొత్తం కేసులు = 1,660
కోలుకున్న వారు = 1,204
యాక్టివ్ కేసులు = 424
మొత్తం మరణాలు = 32

ఎస్పీడీసీఎల్ లో
మొత్తం కేసులు = 2,260
కోలుకున్న వారు = 1,257
యాక్టివ్ కేసులు = 963
మొత్తం మరణాలు = 40

జెన్ కోలో..
మొత్తం కేసులు = 1,256
కోలుకున్న వారు = 907
యాక్టివ్ కేసులు = 313
మొత్తం మరణాలు = 36
ఫస్ట్ వేవ్ లో మరణాలు = 12
సెకండ్ వేవ్ లో మరణాలు = 24

ట్రాన్స్ కోలో..
మొత్తం కేసులు = 595
కోలుకున్న వారు = 302
యాక్టివ్ కేసులు = 284
మొత్తం మరణాలు = 9

అన్ని శాఖల్లో కలిపి వివరాలు

మొత్తం కేసులు = 5,771
కోలుకున్న వారు = 3,670
యాక్టివ్ కేసులు = 1,984
మొత్తం మరణాలు = 117



Next Story

Most Viewed