తెలంగాణపై బీ(జే)పీ..!

by  |
తెలంగాణపై బీ(జే)పీ..!
X

లోకల్ ఫీలింగ్స్‌ను నాడు కాంగ్రెస్ లేటుగా గ్రహించింది. తెలంగాణ ఇచ్చినా..తెచ్చిన వారికే ‘పెద్ద పీట’దక్కడంతో హస్తం తెల్లబోయింది. ఆలస్యానికి రికవరీ లేనంతటి మూల్యం చెల్లించుకున్నది. అది పాత కథే. మరిపుడు బీజేపీకి ఏమైంది? రిపీటెడ్‌గా బీపీ ఎందుకు పెంచుకుంటున్నది? ‘2014లో పార్లమెంటు తలుపులు మూసి..టీవీ ప్రసారాలను ఆపేసి..’, ‘సమగ్ర చర్చ జరుగకుండానే విడగొట్టేశారు..’,‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు టైంలో ఏం జరిగిందో దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు..’అంటూ పీఎం మోడీ మొన్న రాజ్యసభలో కామెంట్స్ చేశారు. అప్పట్లో లోక్‌సభలోనూ అటువంటి వ్యాఖ్యలే వదిలారు. నిజానికి తెలంగాణ బిల్లుకు బీజేపీ నాడు సంపూర్ణ మద్దతునిచ్చింది. కాంగ్రెస్‌ను తిట్టిపోయాలనుకున్న ప్రతి సందర్భంలోనూ మోడీ తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తద్వారా తెలంగాణ ఏర్పాటు తీరును తప్పుబడుతున్నట్టే!

స్థానిక కమలనాథులకు సంకటం

తెలంగాణలో రూలింగ్‌లోకి రాబోయేది బీజేపీయేనని రాష్ట్ర కాషాయ దళం కాలరెగరేస్తున్నది. మరో వంక తెలంగాణపట్ల అదో రకమైన వ్యాఖ్యానాలు సాక్షాత్తూ ప్రధానమంత్రే గుప్పిస్తున్నారు. అవి తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సమ్మతం కాదు. దీంతో రాష్ట్ర కమలనాథులు సంకటంలో పడ్డారు. కడపటి పార్లమెంటు ఎన్నికల్లో 4 లోక్‌సభ సీట్లలో బీజేపీని ప్రజలు గెలిపించారు. దేశాన్ని పాలించే పెద్దలే తరచూ బాధపెట్టే రకంగా మాట్లాడితే..భవిష్యత్తు ఎన్నికల్లో ఇక్కడ సీట్లు పెరుగుతాయా? ఉన్నవి ఊడుతాయా? వారికే తెలియాలి. లోగడ పార్లమెంటులో మోడీ కామెంట్స్ చేసినపుడే..ఇక్కడి జనం మనోభావాలు గాయపడుతున్నాయని రాష్ట్ర నేతలు నివేదించాల్సింది. అలా జరిగినట్టు లేదు. అందుకే మరోసారి పెద్దల సభలో పీఎం తెలంగాణ ఆవిర్భావం తీరుపై వ్యతిరేకంగా ప్రసంగించారు.

‘కారు’పార్టీకి కలిసివస్తున్న మోడీ కామెంట్స్

రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటున్నది. మెలకువలో మాత్రం భిన్నంగానే ప్రవర్తిస్తున్నది! పైగా ఎటొచ్చి డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో టీఆర్ఎస్‌కే మేలు చేస్తున్నది! ఏది భ్రమో, మరేది నిజమో సూటిగా చెప్పలేకపోతున్నది. పీఎం లేటెస్ట్ కామెంట్స్‌పై గులాబీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏకంగా ప్రధానిపైనే విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ అమరవీరులను అవమానించేలా మోడీ ప్రసంగించారని మినిస్టర్లు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మొన్న ఫైరయ్యారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా మోడీపై నిన్నమండిపడ్డారు. దొరికింది ఛాన్స్ అన్నట్టుగా రోజుకో లీడరు కంటిన్యూగా కౌంటరేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను, కేసీఆర్ పోరాటాన్నిఅవమానించడమేనని పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తద్వారా స్టేట్‌లో బీజేపీ ఇమేజ్‌ డ్యామేజ్ అయ్యేలా ఉన్నది. సే‌మ్ టైం ‘కారు’కు పరపతి కలిసివస్తున్నది. ఎటొచ్చి రాజకీయంగా టీఆర్ఎస్‌కే బీజేపీ బెనిఫిట్ చేస్తున్నట్టుంది!


Next Story

Most Viewed