సరిపడా ఉపాధ్యాయులను నియమించండి.. ప్రభుత్వానికి ఎమ్మెల్సీ సూచన

by  |
MLC Narsi Reddy
X

దిశ, ముషీరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్‌ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం దోమలగూడలోని యూటీఎఫ్ భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని, పాఠశాలల పరిశుభ్రత కూడా అత్యంత కీలకం అన్నారు. ఇందుకోసం ప్రతీ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించడంతో పాటు స్వచ్ఛ కార్మికులను నియమించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ప్రభుత్వ విద్యను నిలబెట్టుకునేందుకు ప్రతీ ఉపాధ్యయుడు బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు రూపాందించాలని పిలుపునిచ్చారు.

సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవిలు మాట్లాడుతూ.. దసరా సెలవుల తర్వాత కరోనా నిబంధనలు పాటిస్తూ సాంఘిక సంక్షేమ హాస్టల్స్, గురుకుల, కేజీబీవీ పాఠశాలలన్నింటినీ ప్రారంభించాలని కోరారు. ఏడాదిన్నర కాలం వారి విద్యకు తీవ్ర అంతరాయం కలిగిందని, అది విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మాణాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు, దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు బి.నర్సింహారావు, రాజశేఖర్ రెడ్డి, నాగమణి, వెంకటి, రాజు, గాలయ్య, రవిప్రసాద్ గౌడ్, రవికుమార్, రంజిత్ కుమార్, శ్రీధర్, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed