మళ్లీ అగ్గి రాజేసిన రాజయ్య.. భగ్గుమన్న కడియం

by  |
kadiyam-and-rajaiah
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, MLC కడియం శ్రీహరి భగ్గుమన్నారు. శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కడియం మాట్లాడుతూ.. తన పదవీకాలం ముగిసిందని, ప్రోటోకాల్ లేని వ్యక్తుల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లరాదని ఎమ్మెల్యే రాజయ్య చెప్పడంపై కడియం ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సేవ చేసేందుకు తనకు ఏ ప్రోటోకాల్ అవసరం లేదని స్పష్టంచేశారు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లోనూ, అభివృద్ధిలో తాను పాలు పంచుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ప్రోటోకాల్ ద్వారా నీతినిజాయితీగా పని చేశానని గుర్తుచేశారు.

నియోజకవర్గానికి వచ్చేందుకు ఎవరి వద్దా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని, అనుమతి అంతకన్నా అవసరం లేదన్నారు. పార్టీకి కట్టుబడి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని వివరించారు. దేవాదుల నీళ్లు ఎన్ని గ్రామాలకు వస్తున్నాయి, ఎన్ని గ్రామాలకు రావడం లేదని తెలియని కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు కోరుతున్నారని పరోక్షంగా ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. కష్టాల్లో ఉన్న ప్రజలు వారికి అందుబాటులో ఉండే నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అవసరమైతే ముఖ్యమంత్రి వద్దకు కూడా వెళ్తారని.. అలా వెళ్లడాన్ని తప్పుపట్టడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు ఎవరైనా చేస్తే అభినందించడం తప్ప విమర్శించడం మానుకోవాలన్నారు. ఎవరికీ పదవులు శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో ఉండేలా సేవ చేయడం లక్ష్యంగా ఉండాలన్నారు. సమావేశంలో సీహెచ్ నరేందర్ రెడ్డి, బి వెంకన్న, బి శంకర్, బ్రహ్మారెడ్డి, ఏ వెంకటస్వామి, ఎం రాంబాబు, రాజేష్ నాయక్, సర్పంచ్ లింగారెడ్డి చిల్పూర్, జఫర్గడ్, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్ మండలాల నాయకులు పాల్గొన్నారు.



Next Story