కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు : జీవన్ రెడ్డి

by  |
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు : జీవన్ రెడ్డి
X

దిశ, కరీంనగర్ సిటీ : రైతు సంక్షేమ ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తూ, రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ మాజీ శాసనసభ పక్ష నేత, పట్టభద్రుల MLC తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ టార్గెట్ పెట్టిన అనంతరం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. దీని వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

రెండో పంట విషయంలో ప్రభుత్వాలు ఇంకా స్పష్టతనివ్వడం లేదు. పంట సాగు విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నా, చోద్యం చూస్తుండటం సిగ్గుచేటన్నారు. కొనుగోలు కేంద్రాలలో 70 శాతం పైగా వడ్లు ఇంకా అలానే ఉన్నాయని విమర్శించారు. అటు కొనుగోలు కేంద్రాల్లో, ఇటు మిల్లులో అధిక మొత్తంలో కటింగ్ చేస్తున్నారని.. దీంతో, రైతు ఎకరానికి రూ.3 వేలు వరకు నష్టపోతున్నాడని మండిపడ్డారు. వాస్తవాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంలేదని మండిపడ్డారు. ధాన్యం తూకాల్లో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్ కాంటాలో తూకం వేయకుండా ఇతర మార్గాల ద్వారా కూడా తూకాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. రైస్ మిల్లులో ఒక లారీకి 20 క్వింటాలు దోపిడీ జరుగుతోందని, దీని వెనుక అధికార యంత్రాంగం అలసత్వమైనా ఉండాలి.. లేకుంటే మిల్లర్లతో కుమ్మకైనా అయి ఉండాలన్నారు.

సివిల్ సప్లయ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో కనబడట్లేదని ఎద్దేవ చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే గంగుల మాత్రం క్యాంపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారన్నారు. పౌర సరఫరా శాఖ పనిచేసేదే ఈ నాలుగు రోజులు కాగా, అటు మంత్రి, ఇటు సివిల్ సప్లై అధికారులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇంకా 70 శాతానికి పైగా ధాన్యం కేంద్రాల్లోనే రాశులుగా పోసి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగం నుంచి ధాన్యం సేకరించాలని, లేని పక్షంలో నిరవధిక ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.


Next Story

Most Viewed