సోర్స్ కోడ్ కాపీపై నోరువిప్పిన మిత్రోన్

by  |
సోర్స్ కోడ్ కాపీపై నోరువిప్పిన మిత్రోన్
X

చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భారత్‌లో రూపొందిన ‘మిత్రోన్ యాప్’ సోర్స్ కోడ్ గురించి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోడ్‌లో సెక్యూరిటీ సమస్యల కారణంగానే కొన్నిరోజుల పాటు యాప్‌ను ప్లేస్టోర్ నుంచి కూడా తొలగించారు. అన్ని సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించి తర్వాత గూగుల్ ప్లేస్టోర్‌లో మళ్లీ ప్రవేశపెట్టారు. అయితే మొదట్లో వచ్చినన్ని డౌన్‌లోడ్‌లు ఇప్పుడు రావడం లేదు. సెక్యూరిటీకి ఇబ్బందేం లేదని హామీ ఇచ్చినా కూడా యాప్ డౌన్‌లోడ్లు పెరగడం లేదు. దీంతో యాప్ వ్యవస్థాపకులు శివాంక్ అగర్వాల్, అని ఖండేల్వాల్ స్వయంగా తమ యాప్ గురించి ప్రకటనలు చేశారు. ప్రస్తుతం యాప్‌లో ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు లేవని, ఉన్న ఒక్క యూజీసీ డాక్యుమెంటేషన్ సమస్యను గూగుల్‌తో సంప్రదించి క్లియర్ చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఇక డౌన్‌లోడ్లు ఎక్కువగా చేసుకోకపోవడానికి ఈ యాప్ మీద వచ్చిన ప్రధాన విమర్శ.. సోర్స్ కోడ్ కాపీ చేయడం. దీని గురించి కూడా శివాంక్ స్పష్టతనిచ్చారు.

పాకిస్థాన్‌కు చెందిన క్యూబాక్సస్ కోడింగ్ కంపెనీ నుంచి మిత్రోన్ డెవలపర్లు 25 డాలర్లకు సోర్స్ కోడ్ కొని, దానికి ఎలాంటి అప్‌డేట్స్ చేయకుండా, సెక్యూరిటీ ఫిక్స్ చేయకుండా మిత్రోన్ కోసం వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని స్వయంగా క్యూబాక్సస్ కంపెనీ యాజమాన్యం కూడా ప్రకటించింది. తాము కోడ్ కొనుక్కున్న సంగతి నిజమే కానీ, క్యూబాక్సస్ నుంచి కాదని మిత్రోన్ వ్యవస్థాపకులు చెప్పడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాము ఆస్ట్రేలియాకు చెందిన ఎన్వాటో కంపెనీ నుంచి లైసెన్స్ చేసిన సోర్స్ కోడ్ కొన్నట్లు వారు తెలిపారు. కేవలం టెంప్లెట్ మాత్రమే కొన్నామని, దాన్ని పూర్తి స్థాయిలో కావాల్సినట్లుగా అభివృద్ధి చేసుకున్న తర్వాతే మిత్రోన్ యాప్ విడుదల చేసినట్లు వారు చెప్పారు. కాబట్టి ఇది పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి అనడంలో ఎలాంటి సందేహం లేదని వారు వెల్లడించారు.



Next Story