టిక్ టాక్‌కు పోటీగా ‘మిత్రోన్’ దేశీ యాప్

by  |
టిక్ టాక్‌కు పోటీగా ‘మిత్రోన్’ దేశీ యాప్
X

దిశ, వెబ్ డెస్క్ :
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. ఈ నేపథ్యంలోనే చైనా ఉత్పత్తులన్నీ బ్యాన్ చేయాలనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో చైనా యాప్ అయిన టిక్‌టాక్‌ను కూడా దేశంలో నిషేధించాలని కొందరు భారతీయ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అతి తక్కువకాలంలోనే అత్యధిక పాపులారిటీ సంపాదించిన టిక్‌టాక్‌‌ యాప్‌ను భారత్‌లోనే ఎక్కువగా ఉపయోగిస్తుండటం విశేషం. ఈ పరిస్థితుల నడుమ టిక్‌టాక్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. మార్చి నెలలో దాదాపు మూడున్నర కోట్ల వినియోగదారులు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగా ఏప్రిల్‌ నాటికి అది 2.3 కోట్లకు, మే నెలలో 1.7కోట్లకు పడిపోవడం గమనార్హం. దీనికితోడు ఇప్పుడు మన దేశంలో టిక్ టాక్‌కు పోటీగా డిజైన్ చేసిన ‘మిత్రోన్’ యాప్ వినియోగిస్తున్నారు.

టిక్ టాక్‌పై పెరుగుతున్న వ్యతిరేకతతోపాటు, దానికి పోటీగా వస్తున్న యాప్ కావడం, అది కూడా మనదేశంలో రూపొందడం వల్ల ‘మిత్రోన్’ యాప్‌నకు రోజురోజుకూ వినియోగదారుల ఆదరణ పెరిగిపోతోంది. కేవలం నెల రోజుల్లోనే ఈ యాప్‌ను 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించిన ఈ యాప్.. ప్లే చార్ట్‌లోని ఫ్రీ యాప్స్ జాబితాలో ప్రస్తుతం 12వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో లేదు. యాప్ రేటింగ్ బాగున్నప్పటికీ యాప్‌లో కొన్ని లోపాలున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎర్రర్స్‌ను తొలిగించి, మరింత సెక్యూరిటీగా యాప్‌ను తీర్చిదిద్దితే.. యాప్ అతి తక్కువ రోజుల్లోనే రికార్డు క్రియేట్ చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed