‘నిర్లక్ష్యం చేస్తే మరోసారి రైతుల ఆకలి చావులు’

by  |
‘నిర్లక్ష్యం చేస్తే మరోసారి రైతుల ఆకలి చావులు’
X

దిశ, మహబూబ్‌నగర్: రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులను నిర్లక్ష్యం చేస్తే మరోసారి రాష్ట్రంలో ఆకలిచావులు చూడాల్సి వస్తుందని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతుకు సరైన పంటలు పండించలేకపోతే ఆత్మహత్యే.. తప్ప మరోదారి ఉండదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ… వరి రైతులకు సంబంధించిన విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ వరి విత్తనాలను బయట కొనవద్దని సూచించారు. జిల్లాలో భూత్పూర్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా జరిగేదని గుర్తించిన వెంటనే అక్కడ 8 కేసులు నమోదు చేశామని, వారి నుంచి 15వేల నకిలీ విత్తన పాకెట్లను కూడా సీజ్ చేసినట్టు మంత్రి వెల్లడించారు. అదే విధంగా నవాబుపేట‌లో కూడా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయని వీరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సేవలందించేందుకు రెడీగా ఉన్నారని.. రైతులు వారి సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వ యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని వివరించారు. జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగినా.. జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో రూ.12 కోట్ల వరకూ రుణమాఫీ చేశామని, అతి త్వరలోనే రైతుబంధు డబ్బులు రైతులకు జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే కరోనా వైరస్ ఇప్పట్లో తక్కువ అయ్యే అవకాశం లేదని, వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణహాని కలిగే అవకాశం వుందని, కావున ఏవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే అన్నారు. హరితహారం లో భాగంగా జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని మంత్రి అన్నారు.


Next Story

Most Viewed