విద్యా సంస్థల్లో కరోనా కేసులపై మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు

by  |
Sabitha
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పకడ్భందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో నూరు శాతం రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థల యజమానులు 18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు. ఒకవేళ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

ప్రతి పాఠశాలలను ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించి సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. కేసుల నమోదుపై సోషల్ మీడియాలో వస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. వ్యాక్సినేషన్‌ వంద శాతం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో కొవిడ్‌ ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు నష్టపోయారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Next Story

Most Viewed