సెక్రెటేరియట్‌కు కాకతీయ కళ.. కళ్లు చెదిరే ఫౌంటెన్స్!

by  |
సెక్రెటేరియట్‌కు కాకతీయ కళ.. కళ్లు చెదిరే ఫౌంటెన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భవనానికి వినియోగించే నాణ్యమైన రాళ్ల (స్టోన్) మొదలు గార్డెన్, లాన్, ఫౌంటెయిన్ డిజైన్ వరకు పరిశీలన మొదలుపెట్టింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జైపూర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వివిధ సంస్థానాల కోటలను, ప్యాలెస్‌లను, వినియోగించిన రాళ్లను, వాటి నిర్మాణ శైలిని, డిజైన్‌ను, అక్కడ ఉన్న ఫౌంటెయిన్‌లను పరిశీలిస్తూ ఉన్నారు. పార్లమెంటు భవనం నుంచి మొదలైన మంత్రి పరిశీలన ఇప్పుడు జైపూర్ రాంబాగ్ ప్యాలెస్‌కు చేరుకుంది. తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండడంతో ఏ రకం ఫౌంటెయిన్ వాడితే ఇంపుగా ఉంటుంది, ఏ డిజైన్‌లో నిర్మించవచ్చు, అందుకు నగరంలోని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఎలాంటి రాళ్లను వాడితే బాగుంటుంది.. ఇలాంటి అనేక అంశాలపై మంత్రితో పాటు ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్, ఇంజినీర్-ఇన్-చీఫ్ గణపతిరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శశిధర్ తదితరులు అధ్యయనం చేస్తున్నారు.

పార్లమెంటుకు వాడిన ఆగ్రా, ధోల్పూర్ రాళ్లను, లేత గోధుమవర్ణంతో ఉన్న రాళ్లను నేరుగా క్వారీల దగ్గరకు వెళ్లి పరిశీలించారు. తెలంగాణ సచివాలయాన్ని డిజైన్‌ డెక్కనీ-కాకతీయ శైలిలో నిర్మించనున్నారు. రాళ్ల విషయం దాదాపు కొలిక్కి వచ్చినా ఫౌంటెయిన్ డిజైన్, దానికి వాడే రాళ్ల మీద ఇప్పుడు పరిశీలన మొదలుపెట్టారు. జైపూర్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలైన సికంద్ర, మాన్పూర్‌లలో మంత్రి బృందం ఆదివారం పర్యటించింది. రాంబాగ్ ప్యాలెస్, మహారాజా మాన్‌సింగ్ ప్యాలెస్, మహారాణి గాయత్రి దేవి ఫౌంటైన్‌లను పరిశీలించారు. వాటికి వాడిన రాళ్ల వివరాలను తెలుసుకున్నారు. వాటిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో ఆరా తీశారు. ఆ తర్వాత మాన్పూర్‌లోని స్టోన్ కార్వింగ్ వర్క్‌షాపులను సందర్శించారు.

Next Story