ఆరోగ్యశాఖలో ప్రక్షాళన.. మంత్రి హరీష్ తనదైన మార్క్

by  |
ఆరోగ్యశాఖలో ప్రక్షాళన.. మంత్రి హరీష్ తనదైన మార్క్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హరీశ్​రావు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆ శాఖను క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతీ అంశంపై గ్రౌండ్ ​లెవల్​ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఆఫీసర్లు ఇచ్చిన నివేదికలతో పాటు స్థానిక ప్రజలు ,టీఆర్ఎస్​ పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కూడా మంత్రి కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు చెప్పిన దానికి, వాస్తవిక పరిస్థితుల్లో తేడా కనిపిస్తే సదరు విభాగాపు హెచ్​ఓడీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నిర్లక్ష్యం, సేవల్లో జాప్యం జరగడానికి గల కారణాలను వెంటనే నివేదిక రూపంలో ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో ఆరోగ్యశాఖ రివ్యూల్లో మంత్రి ఎప్పుడు ఏం అడుగుతారోనని హెల్త్ హెచ్​ఓడీలు టెన్షన్​ పడుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడాల్సిన అవసరం లేదని మంత్రి ఆఫీసర్లకు నొక్కి చెప్తున్నారు. ఇక నుంచి ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం జరిగినా, సేవల్లో ఇబ్బందులు కలిగినా చర్యలు తప్పవని మంత్రి హెచ్​ఓడీలకు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఇన్నాళ్లు నెమ్మదిగా ఉన్న అధికారులు హరీశ్​ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

జిల్లాల పర్యటనలేవి?

ఆసుపత్రుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతీనెలా జిల్లాలు విజిట్​ చేయాలని మంత్రి హరీశ్​రావు గతంలో హెల్త్​ హెచ్​ఓడీలకు సూచించారు. కానీ అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో మంత్రి ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్​ఓడీలపై సీరియస్​ అయినట్లు సమాచారం. జిల్లాల్లో తనిఖీలు చేయకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈక్రమంలో మంత్రి నుంచి ఫోన్లు వస్తే చాలు అధికారులు హడలెత్తిపోతున్నారు. అయితే ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం హరీశ్​స్పెషల్​ ఆపరేషన్​పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చితే పేదలకు మెరుగైన వైద్యం అందడమే కాకుండా సిబ్బంది సమస్యలు కూడా ఒక్కోటి పరిష్కారం అవుతున్నట్లు వివరిస్తున్నారు.

స్పీడ్​గా సౌకర్యాలు…

ఈ ఏడాది నవంబరు 10 తేదీన మంత్రి హరీశ్​ ఆరోగ్యశాఖ బాస్​గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి ఆసుపత్రుల్లోని పెండింగ్​ సమస్యలు ఒక్కోటిగా పరిష్కారం కావడమే కాకుండా, నూతన పరికరాలు, వార్డులు, కొత్త ప్రాజెక్టులు వేగంగా వస్తున్నాయి. ఉస్మానియా, ఎంజీఎం, గాంధీలో దాదాపు రెండేళ్లుగా మోరాయించిన క్యాథ్ ల్యాబ్​ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. ఇప్పటికే ఉస్మానియా, ఎంజీఎంలో ఆపరేషన్లు షురూ కాగా, గాంధీ, ఖమ్మం , ఆదిలాబాద్​లో అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక జిల్లాల్లో టీ డయాగ్నస్టిక్ సెంటర్లను పెంచాలని నిర్ణయించారు. ఆర్థిక, వైద్యానికి రెండూ ఆయనే ఉండటంతో కొత్త ప్రాజెక్టులు వేగంగా మంజూరు అవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఈ టాస్కే లక్ష్యం..

సర్కార్​ దవాఖాన్లలో పేషెంట్లకు మరింత భరోసా కల్పించేందుకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికారులు, నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నారు. దీంతో పాటు శానిటేషన్​ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆసుపత్రులు క్లీన్​గా లేకపోతే కాంట్రాక్ట్​ సంస్థను బ్లాక్​ లిస్ట్​లో పెడతామని హెచ్చరించారు. అంతేగాక ఆసుపత్రుల్లో లంచాలు తీసుకుంటున్న వారిపై కూడా మంత్రి దృష్టి పెట్టారు. ప్రత్యేక నిఘా టీంను పెట్టారు. రాబోయే రోజుల్లో జిల్లా ఆసుపత్రుల్లోనూ మంత్రి అకస్మిక తనిఖీలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed