వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: నిరంజన్‌రెడ్డి

by  |
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి: నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రైతు దినోత్సవం వేళ రైతులు రోడ్ల మీద ఉండటం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో ప్రపంచానికి అన్నంపెట్టే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని, ఎముకలు కొరికే చలిలోనూ 28రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ ఆందోళనల వల్ల ఇప్పటికే 41మంది రైతులు చనిపోయారని వాపోయారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని 50 రైతుసంఘాలు, 14మిలియన్ల ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు మద్దతుగా పోరాడుతున్నామని, భారత్‌బంద్‌కు మద్దతుగా 25కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం దేశానికి మంచిదికాదన్నారు.

దేశంలో 55శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరసమాజంపై ఉందని పేర్కొన్నారు. రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని, పంటలకు మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేయడం వంటి 10డిమాండ్లను కేంద్రం భేషరతుగా అంగీకరించాలని మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు.

Next Story