మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో అన్యాయం.. గళమెత్తిన కార్మికులు

by  |
workers
X

దిశ, జవహర్ నగర్: తెలంగాణ రాష్ట్రంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి ప్రజలే కాదు డంపింగ్ యార్డు లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను సైతం డంపింగ్ యార్డ్ యాజమాన్యం, ప్రభుత్వం మోసం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ లో పనిచేస్తున్న కేవిఆర్ యూనియన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించి వెంటనే వేతన ఒప్పందం చేయాలని గేట్ ముందు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించి నిరసన, నినాదాలు చేశారు. వేతన ఒప్పందం 2020 జూన్ తో ముగిసిపోయిందని, కొత్త వేతన ఒప్పందం జులై 2020 నుండి అమలుకావాల్సివుంది. కానీ యాజమాన్యం 15 నెలలు గడుస్తున్నా వేతన ఒప్పందం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరంతరం చెత్త లో పనిచేస్తూ కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నా సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. సరైన భద్రత, కనీస క్యాoటీన్ కూడా ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అని విరుచుపడ్డారు. 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు లేవని, తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించి వేతన ఒప్పంద చేయాలని అడుగుతుంటే యాజమాన్యం కార్మికుల ను వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వేతన ఒప్పందం వెంటనే చేయకపోతే పోరాటం ఉదృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికుల అందరికి జీతాలు పెంచి యూనియన్ కార్మికులకు జీతాలు పెంచడం లేదని యూనియన్ కార్మికుల పట్ల వివక్ష సరైనది కాదని వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.సురేష్, చిప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, హరినాథ్, నర్సింహుల, సుభాన్, రత్నం, బాలాజీ సింగ్, రామకృష్ణ తదితర కార్మికులు పాల్గొన్నారు.

చోద్యం చూస్తున్న మంత్రి మల్లారెడ్డి

నిత్యం కంపులో ఉండి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ఒప్పందం ప్రకారం యాజమాన్యం వేతనాలు చెల్లించకపోగా కార్మికులు, ఉద్యోగులను వేధింపులకు గురిచెయ్యడం సరికాదని ప్రజలు వాపోతున్నారు. ఇదంతా గత నెల రోజుల నుండి డంపింగ్ యార్డ్ ముందు పెద్ద ఎత్తున కార్మికుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నిమ్మకు నీరెత్తినట్లు డంపింగ్ యార్డ్ భాగస్వామ్యం, ప్రభుత్వ అధికారులు, కార్మిక మంత్రి మల్లారెడ్డి సైతం చోద్యం చూస్తున్నారని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సొంత నియోకవర్గంలో ప్రధాన పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయకుండా, పట్టించుకోక పోవడం దురదృష్ట కరమన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో డంపింగ్ యార్డ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలు ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని, లేదంటే డంపింగ్ యాడ్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

Next Story

Most Viewed