ఆదివాసీ మహిళ దెబ్బకు.. తోకముడిచిన మంత్రి కేటీఆర్ అండ్ టీం..?

by  |
Minister KTR
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగినా.. ఏకగ్రీవం ప్లాన్ అట్టర్ ఫ్లాపయింది. కేటీఆర్ సహా మంత్రి అల్లోల, విప్ సుమన్ మంత్రాంగం ఫలించలేదు.. ఆదివాసీ మహిళ ఎదురు తిరిగి నిలవటంతో వ్యూహం బెడిసికొట్టింది. నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు, వ్యూహాలు తిప్పికొట్టాయి. అందరినీ తప్పించినా.. ఆదివాసీ మహిళను తప్పించటంలో చిన్న లాజిక్ మరవటంతో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. దీంతో టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు బరిలో ఉండటంతో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 24 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 22 మంది తమ నామినేషన్లు ఉపహసంహరించినట్టు రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి దండె విట్టల్, స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణి బరిలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెందూర్ పుష్పరాణి తన సంతకం ఫోర్జరీ చేసి.. నామినేషన్ విత్ డ్రా చేసే కుట్ర చేశారని ఆరోపించారు. ఆమెను ప్రతిపాదించిన వ్యక్తి కాని అతను కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లారంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. చిన్న లాజిక్ మరవటంతో సీన్ రివర్స్ అయింది. చివరికి ఆమె పోటీలో నిలవటంతో డిసెంబర్ 10న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదిలాబాద్ స్థానంలో అత్యధికంగా 24 నామినేషన్లు రాగా.. 22 మందిని విత్ డ్రా చేయించారు. చివరికి ఓ స్వతంత్ర అభ్యర్థి విషయంలో చిన్న లాజిక్ మరిచిపోవటంతో బోల్తా కొట్టారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విప్ బాల్క సుమన్, 9 మంది ఎమ్మెల్యేలు, నలుగురు జడ్పీ ఛైర్మన్లు చేసిన ప్రయత్నాలు, వ్యూహాలు చివరికి ఫలించలేదు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవటం.. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు లోపాయికారిగా మద్దతుగా నిలవటంతో అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో స్థానిక ఓటర్లకు క్యాంపు నిర్వహించాల్సి ఉండగా.. వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. 22 మంది అభ్యర్థులను తప్పించేందుకు సామదాన దండోపాయాలు ప్రయోగించినా.. చివరికి ఏ మాత్రం లాభం లేకుండా పోయింది.

ఆదిలాబాద్ స్థానంపై స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి పెట్టారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగినా.. ఏకగ్రీవానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ (స్వతంత్ర) నామినేషన్ ఉపసంహరణ చేయించటంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ రంగినేని పవన్ రావు కీలక పాత్ర పోషించారు. కలాల శ్రీనివాస్ను కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి.. మళ్లీ పాతగూటిలోకి చేర్పించారు. ఇక స్వతంత్ర అభ్యర్థి పెందూరు పుష్పరాణిని తప్పించేందుకు ప్రయత్నించినా.. మధ్యవర్తిత్వం సరిగా లేకపోవటంతో బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆమెకు పరోక్షంగా బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఎంపీ సోయం బాపురావు మద్దతు ఉన్నట్లు సమాచారం. బెల్తరోడ సర్పంచి సాయినాథ్ కూడా తనను అధికార పార్టీ నేతలు బెదిరించారని, తమ కుల పెద్దల నుంచి ఒత్తిడి తేవటం వల్లనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు వీడియో రిలీజ్ చేశారు.

సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన గత నాలుగు రోజులుగా అధికార పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయనను హైదరాబాదులో పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఓ ఎమ్మెల్సీ, జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత మధ్యవర్తిత్వం చేయగా.. ఆయన వెనక్కి తగ్గలేదు. ఇంతలో నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ప్రతిపాదిత వ్యక్తి ఒకరు ఆయన సంతకంతో కూడిన ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. తన సంతకం పోర్జరీ చేశారని.. తాను అసలు సంతకం చేయలేదని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శశాంక గోయల్కును కలిసి ఫిర్యాదు చేశారు. తాను హైకోర్టుకు వెళ్తానని.. అక్కడే తేల్చుకుంటానని చెబుతున్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం


Next Story

Most Viewed