ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఈటల

by  |
ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో: హోం ఐసోలేషన్‌లో చికిత్సలు పొందుతున్న కరోనా పేషంట్లు నిర్లక్షం చేయడం వల్ల తీవ్రమైన శ్వాస కోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల వైద్య అధికారులు,వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఇంట్లో ఉండి చికిత్సలు పొందుతున్న వారిని ఆశా వర్కర్లు రోజుకు రెండు సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలని సూచించారు. ఇంటికి వెళ్లి చికిత్సలు అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని సూచించారు. ఇంట్లో ఒక్కరికి కరోనా సోకితే మిగతా వారందరికి వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. దానిని నివారించేందుకు ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ప్రభుత్వ ఐశోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వైరస్ సోకిన వారికి రక్త పరీక్షలు చేయడం వల్ల వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తుందని దానిని బట్టి పెద్దాసుపత్రి కి పంపించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి విధిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రైవేట్ లో పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారి వివరాలు కూడా వైద్య ఆరోగ్య శాఖ తరుపున హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని చెప్పారు. టెలీ మెడిసిన్ ద్వారా రోగులకు అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పేషెంట్లకు ఇస్తున్న చికిత్సను పర్యవేక్షించాలి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి ఆక్సిజన్ అవసరం అయితే అందించే ప్రయత్నం చేయాలన్నారు. గత వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రంగా లేనందున వ్యాప్తి తగ్గుతుంది అని ఆశిస్తున్నాం అని మంత్రి ఆశా భావం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం అవసరం ఉంటే అవి అన్నీ సమకూర్చుకోండని తెలిపారు. డాక్టర్స్, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియామకం చేసుకోవాలని మరో సారి ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. వైద్యాధికారులకు వెహికల్ అలోవెన్స్ అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

జిల్లా వైద్య అధికారులతో మాట్లాడిన మంత్రి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరం ఉన్న వివరాలు సేకరిస్తున్నామని తెలిపిన డీఎంహెచ్‌ఓలు హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరి దగ్గరికి వెళ్తున్నామని తెలిపారు. రెమ్‌డెసివిర్‌ అందరికీ అవసరం ఉండదని ఐసీఎంఆర్ నిభందనలు మేరకే అందించేలా హాస్పిటల్స్ కి ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి కోరారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండానే చికిత్స మొదలు పెట్టాలని తెలిపారు. అర్బన్ పీహెచ్‌సీలలో, బస్తి దావాఖనాల్లో, జీహెచ్‌ఎంసీ ఏరియా లో ఏఎన్‌ఎంలు , ఆశా వర్కర్లు ఎక్కువ మందిని నియమించాలని ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ ఎం రిజ్వి మాట్లాడుతూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సందర్భంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టెస్టింగ్ ట్రాకింగ్ ట్రీటింగ్ విధానంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. దీనితో పాటు వాక్సిన్ కార్యక్రమం కూడా నడుస్తుందని తెలిపారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేసి కోవిడ్ కేర్ సెంటర్స్ పెంచుతున్నామని చెప్పారు. కుటుంబ సంక్షేమ కమిషనర్,ఎన్‌హఎచ్ డైరెక్టర్ వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ కూడా జిల్లా వైద్య అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

Next Story

Most Viewed