నేను మీ ఇంట్లో ఫంక్షన్లకు వస్తా.. ఆ ‘పని చేయాలంటున్న’ మంత్రి హరీశ్

by  |
Harish-rao
X

దిశ, సిద్దిపేట : పేద ప్రజల కోసం ఇచ్చిన ప్రతీ హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్‌లో లబ్దిదారులకు హరీశ్ రావు కొత్తగా మంజూరు అయిన ఆహార భద్రత కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న లక్ష్యంతోనే ఇచ్చిన హామీ మేరకు సంతృప్త స్థాయిలో రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3లక్షల9వేల83 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. తద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నారని మంత్రి తెలిపారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల 14 కోట్ల రూపాయలతో సంవత్సరానికి దాదాపు 168 కోట్ల రూపాయల్ని అదనంగా వెచ్చించనుందన్నారు.

తెలంగాణలో పాతవి దాదాపు 87 లక్షల 41 వేల కార్డులకు గానూ 2 కోట్ల 79 లక్షల 23 వేల మంది లబ్ధిదారులు రేషన్ పొందుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు ఉన్నాయన్నారు. లబ్ధిదారులు 2 కోట్ల 88 లక్షల మంది ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 90.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రతీ నెల దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సమైక్య పాలకులు రేషన్ కార్డుపై 20 కిలోల బియ్యం సీలింగ్‌ను ఎత్తి వేశామన్నారు. యూనిట్‌కు 4 కేజీల నుంచి 6 కేజీలకు బియ్యాన్ని పెంచామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశ్యమని అన్నారు. కొత్తగా పెళ్లై కుటుంబంలో భాగస్వామ్యం అయిన మహిళలు, చిన్నపిల్లలు పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి అన్నారు. తద్వారా 20 వేల మంది వరకు లబ్ధి జరుగుతుందన్నారు. పేదింటి బిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి అన్నారు.

త్వరలోనే సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే అవకాశం ప్రజలకు ఇస్తామన్నారు. ప్రజల సహకారంతో సిద్దిపేట నియోజవర్గంలో పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం, అభివృద్ధి చేసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజారోగ్యం కోసం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. స్వచ్చబడి పేరుతో ప్రజలకు పారిశుద్ధ్యం, వ్యర్థాల సమర్థ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా 57 రకాల ఆరోగ్య పరీక్షలు, స్కానింగ్ సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్వచ్చ, ఆరోగ్య, ప్లాస్టిక్ రహిత సిద్దిపేట స్వప్నం సాకారం అవుతుందన్నారు. ఇందుకోసం అందరూ స్వచ్చంద సహకారం అందించాలని హరీశ్ రావు కోరారు.

ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్‌ల వాడకం వల్ల కలిగే అనర్థాలను గ్రహించి సిద్దిపేట పురపాలక సంఘంలోని ప్రతీ వార్డులో స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామన్నారు. తక్కువ ఖర్చుతో వీటిని ఫంక్షన్ చేసుకునే కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యావరణ హితంగా ప్లాస్టిక్‌ వాడకం లేకుండా ఫంక్షన్‌లు నిర్వహిస్తేనే.. ఆయన ఫంక్షన్‌లకు హాజరవుతానని మంత్రి అన్నారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ మహమ్మారి బారిన పడే అవకాశం ఉన్నందున తమ వంతు బాధ్యతగా దైనందిన జీవితంలో దూరంగా ఉండాలన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, స్టీల్ డబ్బాలను వాడాలన్నారు.


Next Story

Most Viewed