ప్రతివెయ్యి మందికి… ఒకటి ఉండాలి

by  |

దిశ, సంగారెడ్డి: జిల్లాలోని అన్ని పురపాలికల్లో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా సంగారెడ్డి ఎక్స్‌రోడ్‌లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో అమీన్‌పూర్, సదాశివపేట, బొల్లారం పురపాలక సంఘాల కోసం ఏర్పాటైన మూడు మొబైల్ బయో టాయిలెట్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ… స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా సంగారెడ్డిలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన 346 మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు 115 మాత్రమే ఉన్నాయని, గత నెలన్నరగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, తాను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణాలపై రెగ్యులర్‌గా సమీక్ష నిర్వహించామని తెలిపారు. గత నెల రోజులుగా జిల్లాలో 231 మరుగుదొడ్లను నిర్మించారని, దీంతో జనాభాకు సరిపడ 346 మరుగుదొడ్లు పూర్తయ్యాయని అన్నారు.

అందులో 50 శాతం మహిళలకు 50 శాతం పురుషుల కోసం నిర్మించినట్టు వెల్లడించారు. రివ్యూలో భాగంగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మహిళలు గుళ్లకు, సంతలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా మొబైల్ షీ టాయిలెట్ బస్సులను ప్రతి పట్టణంలో సంత, అంగడి జరిగే చోట ఉంచాలని మంత్రి ఆయా మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్ పర్సన్ మంజూశ్రీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ లు, వైస్ చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story