అజయ్ మిశ్రా నేరస్తుడు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by  |
Rahul-Gandhi-1
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై కాంగ్రెస్ ఎంపీ, నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా నిప్పులు చెరిగారు. ఆశిశ్ మిశ్రాకు తండ్రిగా రైతు హింసాకాండకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఆ మంత్రి తప్పనిసరిగా రాజీనామా చేయాలి. ఆయన నేరస్తుడు’ అని గురువారం లోక్‌సభలో రాహుల్ అన్నారు. ‘మమ్మల్ని లఖీంపూర్ హత్యాకాండపై మాట్లాడేందుకు అనుమతించాలి. కేంద్రమంత్రి ప్రమేయం దాగి ఉందనే కుట్ర ఉంది’ అని చెప్పారు. కాగా దర్యాప్తు సంస్థ కూడా పథకం ప్రకారమే చేసిన కుట్రగా పేర్కొనడంతో చర్చ జరపాల్సిందేనని విపక్షాలు నోటీసులు జారీ చేశాయి. లఖీంపూర్ బాధితులకు న్యాయం చేయాలి, మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఎంపీలు డిమాండ్లు చేశారు.

దీంతో సభను వాయిదా వేశారు. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే కూడా చర్చ జరపాలని పట్టుబట్టారు. ‘మేము ఇప్పటికే లఖింపూర్ ఘటనపై చర్చించాలని 267 నియమం ప్రకారం నోటీసులు అందజేశాం. అక్కడ జరిగిన సంఘటనలపై చర్చ జరగాలి. ముఖ్యంగా రైతులపై దాడి ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని, అది హత్య అని సిట్ స్పష్టంగా చెబుతోంది’ అని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించేందుకు ప్రభుత్వం నిరాకరించడం దాని నైతిక దివాళాకోరుతనానికి నిదర్శనం. నరేంద్రమోడీజీ, భక్తిని జాగ్రత్తగా చూసుకోవడం, మతపరమైన దుస్తులు ధరించడం మీరు నేరస్థుడిని రక్షిస్తున్నారనే వాస్తవాన్ని మార్చవు’ అని ట్వీట్ చేశారు. చట్టప్రకారం అజయ్ మిశ్రాపై వేటు వేయాలని డిమాండ్ చేశారు.

విపక్షాలు తీరు సరైంది కాదు: ప్రహ్లద్ జోషి

విపక్షాలు తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా సభ సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్చకు సుముఖంగా లేదని, సిట్ విచారిస్తుందని తెలిపారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇది న్యాయపరమైన విషయం. చర్చించడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటిపై విపక్షాలు చర్చ నిర్వహించాలని నేను కోరుతున్నాను. మేము ఏమైనా పొరపాట్లు చేస్తే, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. మేము కొవిడ్ లాంటి అంశాలపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

Next Story

Most Viewed