‘కరోనా కంటే ఆకలి చావు భయంకరం’

by  |
‘కరోనా కంటే ఆకలి చావు భయంకరం’
X

న్యూఢిల్లీ: వలస కూలీలు మళ్లీ పనిప్రాంతాలకు మళ్లుతున్నారు. ఆకలి.. కరోనాను మించిన మహమ్మారి అంటూ వలస బాట పడుతున్నారు. తాము కరోనాతో మరణించిన పర్వాలేదు గానీ, తమ పిల్లలు ఆకలి చావులు చావకూడదని ఇల్లు వదులుతున్నట్టు చెబుతున్నారు. సర్కారు ఇచ్చే ధాన్యంతో ఇల్లు గడవడం లేదని, ఇంకా ఎన్నో అవసరాలుంటున్నాయని వివరిస్తున్నారు. ఇంటికాడ తింటూ కూర్చున్నా.. అర్థంతరంగా వదిలి వచ్చిన అద్దె గది కిరాయిలు తడిసిమోపెడవుతున్నాయని వాపోతున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటిపట్టునే ఉండలేమని, తోచిన పనైనా వెతికి చేసుకోవాల్సిందేనని అంటున్నారు.

దీనికితోడు కేంద్ర ప్రభుత్వ లాక్‌డౌన్ క్రమంగా ఎత్తేస్తుండటంతో ఉపాధి మార్గాలు సుగమమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వలస కార్మికులూ తిరిగి పనిప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తత్ఫలితంగా అత్యధిక వలస కూలీలున్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతన్నాయి. కరోనా మహమ్మారి కట్టడికి మార్చి 25న విధించిన లాక్‌డౌన్‌‌తో పనులన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా వలస శ్రామికులకు చేసేందుకు పనిలేకుండా పోయింది. ఉండేందుకు నీడా కరువైంది. గత్యంతరంలేని పరిస్థితుల్లో రవాణా సౌకర్యంలేకున్నా నడుచుకుంటూనే వందల కిలోమీటర్ల ప్రయాణం కట్టిన విషయం తెలిసిందే.

ఇక్కడే ఉపాధి ఉంటే బాగుండేది:

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ సహా పలురాష్ట్రాలకు రైలు సౌకర్యం అందుబాటులో ఉన్నది. ఈ రైల్వే స్టేషన్‌ చేరడానికి 50 కిలోమీటర్ల దూరంలోని దియోరా జిల్లా బస్‌స్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న అన్సారీకి ఊరు వీడాలని లేదని తెలిపాడు. ముంబయిలో గతంలో తాను చేసిన ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోకున్నా, అక్కడికి వెళ్లి వేరే పని వెతుక్కుంటానని అన్నాడు. యూపీలోనే పని దొరికితే తాను ఎక్కడికి వెళ్లకపోయేవాడినని చెప్పాడు. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి ఉన్నా వెళ్లకతప్పడం లేదని పేర్కొన్నాడు. కరోనా కన్నా ఆకలి క్రూరమైనదని, తాను వైరస్‌తో మరణించినా పర్వాలేదు గానీ, తన పిల్లలు ఆకలి చావులు చావరాదని తెలిపాడు.

కోల్‌కతాలో పనిచేసే టెక్నీషియన్ ప్రసాద్ తిరిగి పనికోసం బెంగాల్ వెళ్లాలంటే భయమవుతున్నదని, కానీ, ఇక్కడ ఏ పనీలేకపోవడంతో బతుకుపైనే బెంగపుడుతున్నదని తెలిపాడు. ఏ పనీ చేయక కుటుంబాన్ని ఎలా పోషించాలని అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి గురించి పథకాలను ప్రకటిస్తున్నది కానీ, అవి తమ దాకా రావడం లేదని, ఇక్కడ ఎవరిని అడిగినా అదే చెప్తారని ముంబయిలో పనిచేసిన సిద్దార్థ్ నగర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ అబిద్ తెలిపాడు. మూడు నెలలు ఇంటివద్ద ఉన్న రాజేష్ కుమార్ వర్మ తిరిగి అహ్మదాబాద్ వెళ్లేందుకు బలియా రైల్వే స్టేషన్‌లో కనిపించాడు. ఇక్కడ ప్రభుత్వం రేషన్ సరుకులిస్తున్నదని, 100 రోజుల పని కల్పిస్తున్నదని చెబుతూ, కానీ, అహ్మదాబాద్‌లో తన షాప్, నివసించే గది అద్దెమీద తీసుకున్నారని వివరించారు. వాటి అద్దె ప్రతినెలా పెరుగుతున్నదని, వాటిని ఎలా చెల్లించాలని అడిగాడు.

ముంబయి వెళ్తున్న 8 ట్రైన్‌లు ఫుల్:

వలస కూలీలు ముంబయిలాంటి పట్టణ ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నట్టు తెలుస్తున్నది. యూపీ, బీహార్‌ల నుంచి ముంబయి వెళ్తున్న 11 ట్రైన్ వివరాలను పరిశీలిస్తే అందులో ఎనిమిది ట్రైన్‌లు ఈ నెలాఖరు వరకు ఫుల్ అయ్యాయి. ఈ నెల 26 నుంచి 30వ తేదీల్లో ఈ ట్రైన్‌లు 100 సామర్థ్యానికి టికెట్ల అమ్మకాలు జరిగాయి.

Next Story

Most Viewed