మానవ కణాలను చంపుతున్న మైక్రో ప్లాస్టిక్స్!

by  |
micro plastic
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ పర్యావరణానికి ఎంత హానికరమో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ప్లాస్టిక్‌ కన్నా మించిన ప్రమాదం మైక్రోప్లాస్టిక్‌తో పొంచి ఉంది. నిజానికి ప్లాస్టిక్ సీసాలు, బ్యాగులు చిరిగిపోయినపుడు లేదా పాడైనప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఏర్పడతాయి. ఇవి 5 మిమీ లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా నేలపై, నీటిలో, మనం తాకిన భూ ఉపరితలంపై ఉండే ఈ కణాలు.. ఆవులు, పందుల రక్తంలో ఉన్నట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా మైక్రోప్లాస్టిక్స్ మానవాళికి కూడా ప్రమాదకరమని, అవి మానవ కణాలను చంపుతాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది.

పుట్టబోయే శిశువుల మావి/మాయలో మైక్రోప్లాస్టిక్ కణాలు గతంలో బయటపడటంతో సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. గర్భసంచిలోని మాయలో మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించడం అదే తొలిసారని వెల్లడించిన శాస్త్రవేత్తలు.. ఇవి ఆరోగ్యంపై ఎంతమేర ప్రభావం చూపుతాయో తెలియకున్నా, పిండాలకు మాత్రం దీర్ఘకాలిక నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. ఆ తర్వాత నుంచి మైక్రో ప్లాస్టిక్స్‌పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతుండగా.. ఆహారం, నీటి ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్స్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల మానవ కణాలు మరణిస్తాయని.. అలెర్జీలతో పాటు కణ గోడలకు నష్టం వాటిల్లడం వంటి సమస్యలు తలెత్తుతాయని తేల్చారు.

ప్రస్తుతం మైక్రో ప్లాస్టిక్స్ నుంచి రక్షణకు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో కలవకుండా నివారించడం ఒక్కటే మార్గం. అయితే అనేక మైక్రోప్లాస్టిక్స్ గోళాకారంగా ఉంటాయి. భవిష్యత్ అధ్యయనాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. టాక్సిసిటీకి ఆకారం చాలా ముఖ్యమైంది కాగా.. తదుపరి అధ్యయనాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో ఫార్ములా పాలు తాగుతున్న పిల్లలు రోజుకు మిలియన్ల కణాలను మింగేస్తుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇలా చిన్నారులు, పెద్దలతో పాటు జంతువులకు కూడా వీటివల్ల పెను ప్రమాదముంది. వీలైనంతగా వీటిని అడ్డుకోవడమే మనముందున్న పరిష్కారం.



Next Story

Most Viewed