కరోనాపై పోరాటానికి 'మెస్సీ భారీ విరాళం'

by  |
కరోనాపై పోరాటానికి మెస్సీ భారీ విరాళం
X

ప్రపంచ దేశాలన్నింటా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా యురోపియన్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, వాటికన్ సిటీల్లో కరోనా బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీంతో అక్కడ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రుల్లో వసతులు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు క్రీడాకారులు ఆసుపత్రులను దత్తత తీసుకుంటున్నారు. అదనపు ఐసీయూలు, వార్డులు ఏర్పాటు చేయడానికి తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో బాటలోనే అర్జెంటీనా నేషనల్ టీమ్ కెప్టెన్ లియోనీ మెస్సీ కూడా భారీ విరాళం ప్రకటించాడు.

యూరోపియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్సిలోనా జట్టు తరపున ఆడే మెస్సీ.. బార్సిలోనాలోని ‘క్లినిక్’ ఆసుపత్రితో పాటు అర్జెంటీనాలోని ఓ ఆసుపత్రికి 1 మిలియన్ పౌండ్లు విరాళంగా ప్రకటించాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలను ఈ రెండు ఆసుపత్రులకు అందించనున్నారు. మెస్సీ విరాళానికి క్లినిక్ ఆసుపత్రి తమ ట్విట్టర్ ఖాతాలో కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ మేనేజర్, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు పెప్ గార్డియోలో కూడా ఒక మిలియన్ యూరోలు విరాళంగా ప్రకటించాడు. ఏంజెల్ సోలర్ డానియేల్ ఫౌండేషన్ అండ్ మెడికల్ కాలేజ్ ఆఫ్ బార్సిలోనాకి ఈ విరాళాన్ని అందించాడు. ఈ నిధులతో కరోనా చికిత్స, పరీక్షలకు సంబంధించిన పరికరాలు, ఔషధాలు కొంటామని ఆసుపత్రి తెలిపింది.

tags : Corona, Donation, Football Players, Lionel Messi Argentina, Ronaldo

Next Story

Most Viewed