కేంద్ర మంత్రివర్గంలో మార్పులు

by  |
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు
X

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2019లో రెండోసారి కొలువైన తర్వాత ఇప్పటి వరకు క్యాబినెట్‌‌లో మార్పులు చేపట్టలేదు. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినప్పటి నుంచి దీనిపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అందుకోసం ప్రధానమంత్రి తన అధికారిక నివాసంలో స్వయంగా కేంద్ర మంత్రులు, ఆయన డిప్యూటీలతో సమీక్షలు జరుపుతున్నారని సంబంధితవర్గాలు తెలిపాయి. వారి పనితీరును, చేపట్టిన కార్యక్రమాల గురించి ఆరా తీస్తున్నట్టు చెప్పాయి. ప్రతీ సమావేశం కనీసం ఐదు గంటలపాటు జరుగుతున్నదని వివరించాయి. ఇప్పటి వరకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, గిరిజన వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక, పౌర విమానయానం, రైల్వే, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, జలశక్తి, పెట్రోలియం, స్టీల్, పర్యావరణం సహా పలు శాఖల బాధ్యులతో ప్రధాని భేటీ అయ్యారని పేర్కొన్నాయి. వీటన్నింటిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారని తెలిపాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ కావడంతో క్యాబినెట్‌లో మార్పులు జరుగుతున్నాయన్న వాదనలకు బలం చేకూరింది.

అసెంబ్లీ పోల్స్‌కు మొదలైన కసరత్తు?

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ఇప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. యూనియన్ క్యాబినెట్‌లో మార్పులతోపాటు రాష్ట్రాల్లోనూ పార్టీ బాధ్యులు, ప్రభుత్వాల పనితీరును సమీక్షిస్తున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌లోనూ మార్పులు జరగబోతున్నట్టు చర్చ జరుగుతున్నది.


Next Story

Most Viewed