వనజాతరలో జనం ‘కిక్కే కిక్కు’

by  |
వనజాతరలో జనం ‘కిక్కే కిక్కు’
X

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మకు భక్తులు లక్షల సంఖ్యలో యాటలు బలిచ్చారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో మాంసం వ్యాపారమే దాదాపు రూ. 160 కోట్లకు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రెండు లక్షలకు పైగా గొర్రెపోతులు, మేకలు తెగడంతో పాటు 9 నుంచి 11లక్షల వరకు కోళ్లు అమ్ముడుపోయాయి. మాములు రోజుల్లో ఎటూ చూసినా వనమే కనపడే మేడారంలో జాతరకు పదిరోజుల ముందు నుంచే అడవి మొత్తం జనసంద్రమైపోయింది. ఇప్పటికే జన దేవతలు వనప్రవేశం చేసినా ఇంకా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి గద్దెలను దర్శనం చేసుకుంటున్నారు. కేవలం నాలుగురోజుల్లోనే రూ. 130 కోట్లకు పైగా విలువైన గొర్రెలు, మేకలతో పాటు రూ.30 కోట్ల విలువైన కోళ్లను భక్తులు ఆరగించారంటే భక్తులు ఏరేంజ్‌లో ఎంజాయ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

యాటలు, కోళ్లకే రూ.160 కోట్ల వరకు ఖర్చు చేసిన భక్తులు మందుకు రెండు మూడింతలు ఎక్కువే ఖర్చు చేశారు. సుక్క, ముక్కను ఆరగించి నాలుగురోజుల పాటు పండగ చేసుకున్నారు. యూత్ కూడా ఫ్రెండ్స్‌తో జాతరకు వెళ్లి గూడారాలు వేసుకొని యాటలు, కోళ్లు కోస్కొని తిని వచ్చారు. జాతరలో మొత్తం 39వేల వరకు లిక్కర్ కేసులతో పాటు, 11వేలకు పైగా బీర్‌ కేసులను లాగించేశారు. ఇవి జాతర దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షాపుల్లోనే జరిగిన విక్రయాల లెక్కలే. కాగా, ఇంక లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు వెళ్లే సమయంలోనే మందు తీసుకెళ్లారు. అనుకున్నదానికంటే బీర్లు, లిక్కర్లు విపరీతంగా అమ్ముడుపోవడంతో ప్రభుత్వ ఖజానాకు మస్తు కిక్ వచ్చింది.

రెండోళ్ల కోసారి మాత్రమే వచ్చి పండగ కావడంతో మేడారానికి వచ్చిన వారంతా యాటలతో పాటు కోళ్లు కోస్కొని తిని మస్తు ఎంజాయ్ చేశారు. దూరప్రాంతాల నుంచి జాతరకు వచ్చిన భక్తులు మూడు నాలుగురోజుల పాటు గూడారాల్లోనే ఉన్నారు. గద్దెల వద్ద తల్లలను దర్శనం చేసుకున్న అనంతరం బీర్లు, లిక్కర్ తాగి ఊగిపోయారు. ఖర్చును లెక్కచేయకుండా చుట్టాలు పక్కాల్, దోస్తులతో కలిసి చిందేశారు. వండిన యాటకూర అయిపోయినా మళ్లీ వెళ్లి కోళ్లను తెచ్చుకొని ఆరగించేశారు. జాతరలో ఆట బొమ్మల నుంచి అన్నింటివరకు భక్తులు మస్తు ఖర్చు పెట్టడంతో దాదాపు రూ.240 కోట్ల వరకు వ్యాపారం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Next Story

Most Viewed