వెయ్యి ఎకరాల్లో మారుతీ సుజుకి కొత్త ప్లాంట్..

by  |
RC Bhargava
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన సంస్థ మారుతీ సుజుకి హర్యానాలోని తన కొత్త తయారీ ప్లాంట్ కోసం రూ. 18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ అన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ పెట్టుబడులు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కొత్త ప్లాంట్‌లో ఏటా 10 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తిని చేపట్టేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈ కొత్త ప్లాంట్‌ను మొత్తం 700 నుంచి 1,000 ఎకరాల ప్రాంగణంలో నిర్మించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రారంభం కావాల్సి ఉండగా, కొవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైందని భార్గవ వివరించారు. రూ. 17,000-18,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలనే కంపెనీ ప్రణాళిక ఉందని, ఏడాదికి 7.5 లక్షల నుంచి 10 లక్షల కార్లను తయారు చేస్తామని, త్వరలో కొత్త ప్లాంట్‌లో పనులు మొదలవుతాయని ఆయన చెప్పారు. కాగా, 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురుగ్రామ్ ప్లాంట్ ను స్థలం సరిపోని కారణంగా మార్చేందుకు కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్లాంట్ చుట్టూ నివాస గృహాలు ఉండటంతో, కంపెనీకి చెందిన ట్రక్కుల సరఫరా వల్ల ఇబ్బందులను ఉత్పన్నమవుతున్నట్టు కంపెనీ గురించిందని సమాచారం.



Next Story