మర్కజ్ పోయి… రోహింగ్యా వచ్చె

by  |
మర్కజ్ పోయి… రోహింగ్యా వచ్చె
X

దిశ, న్యూస్ బ్యూరో: విదేశీ ప్రయాణికుల ద్వారా వచ్చిన కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యలు జరుగుతుండగానే కరీంనగర్‌లో ఇండోనేషియా పౌరుల మర్కజ్ యాత్ర కలకలం సృష్టించింది. ఇప్పటికీ దాన్నుంచి బయటపడలేక రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో రోహింగ్యా సమస్య వచ్చిపడింది. హైదరాబాద్ క్యాంపుల్లో ఉన్న రోహింగ్యాలు మర్కజ్‌కు వెళ్ళి వచ్చారని, వారికి కూడా వైరస్ సోకి ఉండవచ్చని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఈ క్యాంపులో ఉంటున్న రోహింగ్యాలు తబ్లిఘీ జమాత్ కార్యక్రమానికి మాత్రమే కాక హర్యానాలోని మేవాలో జరిగిన ‘ఇజ్తెమా’కు కూడా హాజరయ్యారని కేంద్ర హోంశాఖ వివరించింది. హర్యానాలోని మేవాలో జరిగిన కార్యక్రమం కూడా తబ్లిఘీ జమాత్ నిర్వహించిందని, అక్కడ పాల్గొన్న తర్వాత ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్ళారని పేర్కొంది. వీరితోపాటు ఢిల్లీలోని శ్రమ విహార్, షహీన్‌బాగ్ ప్రాంతాలకు చెందినవారు కూడా తబ్లిఘీ జమాత్‌కు హాజరయ్యారని, అయితే ఆ తర్వాత వారు తిరిగి క్యాంపులకు చేరుకోలేదని పేర్కొంది. పంజాబ్‌లోని డేరాబస్సి, జమ్మూ, కశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్ము ప్రాంతానికి చెందిన రోహింగ్యా ముస్లింలు కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారని వివరించింది.

అయితే ఈ కార్యక్రమాలకు హాజరైనవారిలో హెచ్చుమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినందున ఇప్పుడు వీటికి హాజరైన రోహింగ్యాలకు కూడా సోకే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ అనుమానం వ్యక్తం చేసింది. వారిని గుర్తించి ఇంతకాలం వారితోపాటు కాంటాక్టులోకి వెళ్ళినవారిని కూడా గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఏ మేరకు వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిందో నిర్ధారించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ డిప్యూటీ కార్యదర్శి ఈ నెల 15న రాసిన లేఖలో పేర్కొన్నారు.

నగరంలోని బాలాపూర్‌లో వందల సంఖ్యలో రోహింగ్యాలు నివసిస్తున్నారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరిలో కొంతమందికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు(శరణార్థి) కార్డులు కూడా ఉన్నాయి. ఈ క్యాంపుల్లో ఉన్నవారిలో ఎక్కువ మంది ముస్లింలే. చట్టం ప్రకారం వీరికి ఆధార్ కార్డు లాంటివి మంజూరు కావు. కానీ, దొడ్డిదారిన కొంతమంది ఆధార్ కార్డులు కూడా సంపాదించారు. వాటి పేరు మీద మొబైల్ సిమ్ కార్డులు కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు తబ్లిఘీ జమాత్ ఆధ్వర్యంలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్, హర్యానాలోని మేవాలో జరిగిన కార్యక్రమాలకు హాజరైనందున వీరికి కూడా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు రోహింగ్యాల విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ లేఖతో రంగంలోకి దిగుతున్నారు. అసలే మర్కజ్ వ్యవహారంతో ఇంకా పూర్తిస్థాయిలో గుర్తింపు సాధ్యం కాకపోవడంతో నగరంలోని సుమారు 130 బస్తీలను కార్డన్ చేసి ‘కంటైన్‌మెంట్ క్లస్టర్’లుగా ప్రకటించి ఆ ప్రాంతాన్ని సీల్ చేసి వైరస్ సోకినవారిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్న సమయంలో రోహింగ్యాల అంశం కూడా తెరపైకి రావడంతో ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

వీరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎంతమందికి పాజిటివ్ ఉందో, ఇప్పటికే వారి ద్వారా ఎంతమందికి సోకిందో స్పష్టమవుతుంది.

Tags : Telangana, Corona, Positive, Rohingya, Balapur, Union Home Ministry

Next Story

Most Viewed