ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో మార్చి జీఎస్టీ వసూళ్లు!

by  |
ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో మార్చి జీఎస్టీ వసూళ్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లలో మరోసారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి మొత్తం రూ. 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ గురువారం వెల్లడించింది. 2017, జులైలో జీఎస్టీ వ్యవస్థ అమలైన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదవడం ఇదే తొలిసారని ఆర్థికశాఖ తెలిపింది. గత ఆరు నెలలుగా జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లకు మించి వసూలవుతున్నాయని, కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో జీఎస్టీ వసూళ్ల ధోరణి ఈ స్థాయిలో కొనసాగుతుండటం ఆర్థిక రికవరీకి స్పష్టమైన సూచిక అని కేంద్రం అభిప్రాయపడింది.

మార్చి నెల జీఎస్టీ వసూళ్లు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 27 శాతం ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ. 22,973 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ. 62,842 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 31,097 కోట్లతో సహా), సెస్ రూ. 8,757 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 935 కోట్లతో సహా) వసూలయ్యాయి. రాష్ట్రాల వారీగా గమనిస్తే..మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో గరిష్ఠగా మణిపూర్ 40 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 38 శాతం, త్రిపుర, జమ్మూ కశ్మిర్ రాష్ట్రాలు చెరో 31 శాతం వసూళ్లను సాధించాయి. సమీక్షించిన నెలలో గతేడాది ఇదే నెలతో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 17 శాతం వృద్ధి నమోదవగా, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం వృద్ధి నమోదైంది.



Next Story

Most Viewed