నాడు విషం.. నేడు విస్పోటనం.. మారిన మావోల పంథా

170
maoists Arrow bomb

దిశ ప్రతినిధి, కరీంనగర్: దండకారణ్య అటవీ ప్రాంతంలో సరికొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు మావోయిస్టులు. విల్లులకు విస్పోటనం పెట్టి శత్రువును మట్టుబెట్టే కొత్త తరహా యుద్దానికి తెరలేపారు. జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన ఈ ఘటన వెనక భారీ కసరత్తు చేసిన్టుటగా అర్థం అవుతోంది. మావోయిస్టులు ఈ విధానం ఎలా సాధ్యం అయింది? ప్రకృతిలోని వనరులను వినియోగించుకుని ఎలా ముందుకు సాగుతున్నారు అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. తాజాగా జగ్దల్ పూర్, రాజమండ్రి జాతీయ రహదారిపై బాణం బాంబు వినియోగించడమే ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

భూంకాల్ పోరాటమే స్ఫూర్తి

దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడపడానికి ప్రధాన కారణం, అక్కడి ఆదివాసీలను అక్కున చేర్చుకోవడానికి మూలం భూంకాల్ పోరాటమే కారణం. 1910లో జరిగిన అక్కడి ఆదివాసీలు చేసిన పోరాటాన్ని ఆసరగా చేసుకున్న మావోలు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ప్రపంచ చరిత్రలో ఆదివాసీల పోరాటాల్లో ఒకటిగా నిలిచే భూంకాల్ పోరాటానికి వెనకున్న కారణాలు ఇవే. అఖండ భారతదేశాన్ని తమ కబంద హస్తాల్లోకి తీసుకుని పరిపాలిస్తున్న బ్రిటీష్ పాలకులు దేశంలో ఖనిజ సంపదను ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పడవల ద్వారా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి, ఇంద్రావతి నది పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న దండకారణ్య అటవీ ప్రాంతంలోని అభూజ్ మడ్ గిరులపై బ్రిటీష్ పాలకుల కన్ను పడింది. కీకారణ్యాలు, గుట్టల నడుమ ఉన్న ఆ ప్రాంతంలోని అభూజ్ మడ్ లో భారీగా ఖనిజ సంపద ఉందన్న విషయాన్ని గమనించిన పాలకులు అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలన్న లక్ష్యంతో బ్రిటీష్ పాలకులు యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఆనాడు అందుబాటులో ఉన్న ఆధునిక ఆయుధాలను సమకూర్చి 10 వేల మంది సైన్యాన్ని అభూజామడ్ అటవీ ప్రాంతంపై దాడికి పంపించింది. అయితే అప్పటికే అడవుల్లో మమకేమై వన్యప్రాణుల నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆదివాసీలు సాంప్రాదాయ ఆయుధాలను వాడే వారు. విల్లులు, బరిశెలు, వెదురుతో పదునైన ఆయుధాలను తయారు చేసి స్వీయ రక్షణ కోసం ఉపయోగించే వారు. వీటికి అడవుల్లో దొరికి విషంతో కూడిన పసర్లను కూడా పూసే వారు. బ్రిటీష్ సైన్యం అభూజ్ మడ్ ప్రాంతంపై దండయాత్ర ప్రారంభించిందో వెంటనే అక్కడి ఆదివాసీ బిడ్డలు కూడా ఎదురు దాడికి సమాయాత్తం అయ్యారు. ఎత్తుగా ఉండే చెట్లపై నుండి యువకులు విల్లులకు విషం పూసి దాడులు చేస్తే, విల్లులు, ఇతరాత్ర ఆయుధాలతో బ్రిటీష్ సైన్యంపై ముప్పేట దాడి చేశారు. దీంతో వారి ఎత్తుగడలకు బ్రిటీష్ సైన్యం వెనుదిరగక తప్పలేదు. అప్పటి నుండి తమ ప్రాంతాన్ని తామే రక్షించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు దండకారణ్య అటవీ ప్రాంత ఆదివాసీలు.

మావోల పర్ ఫెక్ట్ ప్లాన్…

గత కాలం నాటి చరిత్రను ఆధారం చేసుకున్న పీపుల్స్ వార్ నక్సల్స్ వ్యూహాత్మకంగా ఛత్తీస్ ఘడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అక్కడి జనంతో మమేకమై వారికి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, నీటి వనరులను ఉపయోగించుకోవడం వంటివి నేర్పి క్రమక్రమంగా వారికి పెద్ద దిక్కుగా మారారు. ఇదే క్రమంలో ఆదివాసీలు స్వీయ రక్షణ కోసం వినియోగస్తున్న ట్రెడిషనల్ ఆర్మ్స్ ను గమనించి వాటిని ఉపయోగించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం అయిన తరువాత కూంబింగ్ ఆపరేషన్లకు వెళ్లే పోలీసులపై మందుపాతరలు పెట్టి పేల్చిన తరువాత బతికున్న వారిపై విల్లులతో అటాక్ చేసే వారు. బాణాలకు విషం గుణాలున్న పసరు పూయడంతో బతికున్న జవాన్లు కూడా మట్టికరిచే వారు. ఆధునిక ఆయుధాలను తెప్పించుకుంటున్నప్పటకీ ఆ ప్రాంతంలో ఎక్కువగా సాంప్రాదాయ ఆయుధాలనే ఉపయోగించే వారు. నాటి ఆదివాసీల పోరాట స్ఫూర్తితో భూంకాల్ మిలీషియా పోరాటానికి శ్రీకారం చుట్టిన మావోయిస్టులు ఇందులో రిక్రూట్ చేసుకున్న వారికి ఆయుధంతో పాటు విల్లు కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ముందుగా విల్లుతో దాడి చేసి తప్పని పరిస్థితుల్లో మాత్రమే గన్ ను ఉపయోగించే విధానంతో గత రెండు దశాబ్దాలకు పైగా ముందుకు సాగుతున్నారు.

న్యూ స్టైల్ అటాక్…

అయితే పీపుల్స్ వార్ గా ఉన్న సమయంలో అయినా మావోయిస్టులో విలీనం అయిన తరువాతే అయినా తమ చేతికి చిక్కిన ఆయుధాలను వినియోగించి తమ బలం ఏంటో చెప్పకనే చెప్పేవారు. ఏకె 47, ఎస్ఎల్ఆర్, రాకెట్ లాంఛర్, మెర్టార్ షెల్స్, క్లైమోర్ మైన్స్ ఇలా కొత్త పద్ధతులతో దాడులు చేసినప్పుడు చర్చకు దారి తీసేది. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా బాణాలకు పేలుడు పదార్థాలు అమర్చి దాడులు చేసి పద్ధతికి శ్రీకారం చుట్టడమే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు బాణాలకు విష గుణాలు ఉన్న పసర్లను పూసి దాడులు చేసిన మావోలు ఇప్పుడు విస్పోటనం ఎలా అమర్చగలిగారు, అది ఎలా పేలుతుంది అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. బాణానికి పూసిన మందుగుండు రాపిడి లేక ఒత్తిడికి గురి కాగానే పేలుతుందా లేక మరో రకంగా పేలుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఇంతకాలం అంతర్జాతీయ స్థాయిలో తయారైన ఆధునిక ఆయుధాలను వినియోగించి ప్రభుత్వాలకు సవాల్ విసిరిన మావోయిస్టులు ఇప్పుడు సాంప్రాదాయ ఆయుధాలనే పేలుళ్లకు ఉపయోగించి సంచలనం కల్గిస్తున్నారు. వివిధ దేశాల నుండి ఆయుధాలను సమకూర్చుకోవడం కన్న స్థానికంగా ఉన్నా వనరులను ఆసరాగా చేసుకుని సరికొత్త సవాల్ విసరాలన్న లక్ష్యంతో ముందుకు సాగి సక్సెస్ అయ్యారని స్పష్టం అవుతోంది. అయితే మావోయిస్టులు వేసిన ఈ కొత్త ఎత్తుగడతో పోలీసుల అంచనాలను మాత్రం తలకిందులు చేసినట్టయింది. సాంప్రాదాయ ఆయుధాలకు పేలుడు పదార్థాలను పెట్టి పేల్చడం అనేది ఎలా సాధ్యమయిందన్నదే అంతు చిక్కకుండా తయారైంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..