28న రాష్ట్ర బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపు

by  |
28న రాష్ట్ర బంద్ కు మావోయిస్ట్ పార్టీ పిలుపు
X

దిశ, భద్రాచలం :
వరుస బూటకపు ఎన్ కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 28న తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించాలని ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జగన్ పేరుతో ప్రకటన విడుదల కావడంతో మావోయిస్టు ప్రభావిత మన్యం పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ పేరుతో ఉన్న ప్రకటన సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. చెన్నాపురం, కడంబ, పూసుగుప్ప, దేవర్లగూడెంలో జరిగినవన్నీ బూటకపు ఎన్ కౌంటర్లే అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వరుస ఎన్ కౌంటర్లలో శంకర్ (ఏసీఎం) శ్రీను (ఏసీఎం), గ్రామస్తుడు ఐతు, చుక్కాలు (దళ సభ్యుడు), బాజీరావు (దళ సభ్యుడు) జోగయ్య (ఏసీఎం), రాజే, లలిత (దళ సభ్యురాలు) లు మొత్తం 8 మంది చనిపోయారని పేర్కొన్నారు.‌ ఈ మధ్యకాలంలో పోలీసులపైగానీ, అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులపైగానీ మావోయిస్టు పార్టీ ఎలాంటి భౌతికదాడులకు పాల్పడలేదన్నారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని జగన్ తన ప్రకటనలో ఆరోపించారు. అందుకే బూటకపు ఎన్ కౌంటర్లను నిరసిస్తూ నిర్వహించనున్న బంద్ లో అన్నివర్హాల ప్రజలు పాలుపంచుకోవాలని జగన్ కోరారు.


Next Story

Most Viewed