హీరోను కాదు.. నిందితుడిని చూపించండి.. మీడియాపై మంచు మనోజ్ ఫైర్

by  |
హీరోను కాదు.. నిందితుడిని చూపించండి.. మీడియాపై మంచు మనోజ్ ఫైర్
X

దిశ, ఎల్బీనగర్ : సాయి ధరమ్ తేజ్ ఎలా పడ్డాడు అని త్రీడీ చేసి చూపిస్తున్నారు. ఇంత క్రూరమైన, అమానుషమైన ఘటనను ఎందుకు హైలెట్ చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ మీడియా చానల్స్‌ను టార్గెట్ చేశారు. మీడియా ఈ ఘటనను ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మంగళవారం సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని సినీ నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీవీ చానల్స్ ఓపెన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ బైక్ పై నుంచి ఇలా పడ్డాడు.. అలా పడ్డాడు అని త్రీడీ చేసి చూపిస్తున్నారని, అత్యంత క్రూరమైన ఘటనను ఎందుకు హైలెట్ చేయడం లేదని ఆయన మీడియాను ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఉంటే వారిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదని.. చేతకాని వాడిలా నాకు అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు మేమందరం బాధ్యత తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. పిల్లలను, ఆడవాళ్లను సమాజంలో ఎలా ఉండాలో నేర్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఇది మనందరి కర్తవ్యంగా భావించాలని అన్నారు. ఈ ఘటనను ప్రతీ ఒక్కరం సీరియస్‌గా తీసుకుని నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాలని కోరారు.

గత ఏడాది ఛత్తీస్‌గ‌ఢ్‌లో మూడున్నరేళ్ల బాలిక ఇలాంటి దుస్థితిలోనే చనిపోతే నిందితులకు శిక్ష పడేందుకు ఏడాది కాలం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలకు పాల్పడ్డ నిందితులను పట్టుకొని 24 గంటల్లో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed