వచ్చే 12 నెలల్లో సొంత వాహనాన్ని కొనేందుకు మెజారిటీ వినియోగదారుల ఆసక్తి!

by  |
automobile
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్నేళ్లుగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న దేశీయ ఆటో పరిశ్రమకు రానున్న రోజుల్లో కలిసి రానున్నది. ప్రముఖ ఆటో పరిశోధనా సంస్థ మొబిలిటీ ఔట్‌లుక్ సర్వేలో భారత్‌లోని మెజారిటీ వినియోగదారులు రాబోయే 12 నెలల్లో కొత్త వాహనాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఇన్‌పుట్ ఖర్చులు, సెమీకండక్టర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆటో పరిశ్రమకు ఇది శుభవార్తే. ఈ సర్వే ప్రకారం.. 83 శాతం మంది రాబోయే ఏడాదిలోగా తాము సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరో 13 శాతం మంది కొనాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. కేవలం 4 శాతం మంది మాత్రమే కొనే ఆలోచన లేదని చెప్పారు.

ప్రముఖ ఆటో క్లాసిఫైడ్‌ సంస్థ కార్‌ట్రేడ్‌కు చెందిన మొబిలిటీ ఔట్‌లుక్ దేశంలోని దాదాపు 2.7 లక్షల మంది నుంచి ఈ అభిప్రాయాలను సేకరించింది. సొంత వాహనాన్ని కావాలనుకునే వినియోగదారుల కొనుగోలు ఆసక్తి ఆర్థికవ్యవస్థలో మెరుగైన పునరుద్దరణను సూచిస్తుందని సర్వే నివేదిక తెలిపింది. ఇదే సమయంలో కేవలం కొత్త వాహనాన్ని మాత్రమే కొనే ఆలోచన కాకుండా సెకెండ్ హ్యాండ్ వాహనాన్ని కొనడంలో కూడా వినియోగదారుల ఆసక్తి బలంగా ఉందని నివేదిక పేర్కొంది. 52 శాతం మంది కొత్త కారును కొనాలని చెబుతుండగా, 33 శాతం మంది కొత్త స్కూటర్ లేదా మోటార్‌సైకిల్ కొంటామంటున్నారు. ఇదే సమయంలో 74 శాతం మంది నేరుగా డీలర్‌షిప్‌ల నుంచి సొంత వాహనాన్ని కొనాలనుకుంటుంటే, 17 శాతం మంది 1-4 ఏళ్ల దీర్ఘకాలిక లీజింగ్, 5 శాతం మంది స్వల్ప కాలానికి అంటే ఏడాదిలోపు లీజింగ్ కోసం చూస్తున్నారని సర్వే వెల్లడించింది.

Next Story

Most Viewed