ప్రతిరోజూ క్వార్టర్ బాటిల్ డోర్ డెలివరీ.. హుజురాబాద్‌లో జోరుగా ప్రలోభాలు

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు దసరా సంబురాలు రెండు మూడు రోజులే. కానీ హుజురాబాద్ ప్రజలకు మాత్రం ఈ నెలాఖరు వరకూ పండుగే. ఓటర్లు మందుబాబులకు అయితే డబుల్ ధమాకా. కొనుక్కోవాల్సిన పని లేకుండా ప్రతిరోజూ వారి ఇంటికే క్వార్టర్ బాటిల్ వచ్చేస్తున్నది. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ పోటీపడి మరీ డోర్ డెలివరీ చేస్తున్నాయి. తాగుడు అలవాటులేని వారికి థమ్సప్ ఫుల్ బాటిల్ ఇస్తున్నారు. జూన్ నెల నుంచి ఎన్నికల వాతావరణం రావడంతో కొత్తగా యువత మద్యానికి అలవాటు పడింది. ఏ ఇంట్లోని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినా థమ్సప్, బీరు బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఉప ఎన్నిక మహత్యం. ఇక ఇంటింటికీ మటన్ సప్లయ్. ఈ నెల 30న పోలింగ్ ముగిసేవరకు సెగ్మెంట్​ అంతటా దసరా సంబురాలే.

ఓట్ల పండుగ

మామూలుగా దసరా పండుగ అంటేనే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈసారి దానికి తోడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా వచ్చేసింది. మూడు బీర్లు, ఆరు బ్రాందీలుగా లిక్కర్ వ్యాపారం సాగుతున్నది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రూ. 500 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. మామూలుగానైతే రోజుకు సగటున రాష్ట్రం మొత్తం మీద రూ. 75 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. కానీ ఈసారి ఏకంగా రూ. 170 కోట్లకు పెరిగింది. ఈ నెలాఖరు వరకూ హుజురాబాద్‌తో పాటు మొత్తం కరీంనగర్ జిల్లాలోనే మద్యం విక్రయాలు మోత మోగిపోనున్నాయి. నియోజకవర్గంలోని మొత్తం రెండున్నర లక్షల ఓటర్లలో దాదాపు రెండు లక్షల మందికి ప్రతిరోజూ రెండు పార్టీలు క్రమం తప్పకుండా క్వార్టర్ బాటిల్ సప్లయ్ చేస్తున్నాయి.

వద్దన్నా మందు

నేతల మందు చూపులో ఓటర్లు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. అడగకున్నా విస్కీ బాటిళ్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. హుజురాబాద్‌లో ప్రతిరోజూ రెండు పార్టీల నాయకులు కోట్ల రూపాయల్లో ఖర్చు చేస్తున్నారు. ‘ఫ్రీగా వస్తుంటే వద్దంటామా..? అందులో తప్పేముంది’ అంటూ ఓటర్లు వాటిని తీసుకుంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఓటర్లకు పార్టీలు ఇలాంటి అతిథి మర్యాదలే చేయనున్నాయి. ఇక పోలింగ్‌కు ఒకటి, రెండు రోజు ముందు ఓటుకు పది వేలైనా రాకపోతాయా అనే చర్చలు మొదలయ్యాయి.

కళ్లప్పగించి చూస్తున్న అబ్జర్వర్లు

ఇంత జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులకు మాత్రం ఏమీ పట్టనట్లుగానే ఉన్నది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా పరిశీలకులను, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తుంది. హుజురాబాద్‌కు కూడా అలాంటివారు వచ్చారు. కానీ ప్రేక్షకులుగానే ఉండిపోయారు. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా, కోడ్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు.


Next Story

Most Viewed