డేంజర్ ప్లేస్.. పోతున్న ప్రాణాలు.. హామీ మరిచిన ఎమ్మెల్యే?

by  |
డేంజర్ ప్లేస్.. పోతున్న ప్రాణాలు.. హామీ మరిచిన ఎమ్మెల్యే?
X

దిశ, జడ్చర్ల : లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని వేముల గ్రామం చెందిన నరేందర్ చారి (44) తమ గ్రామంలో నిర్వహించే కోట మైసమ్మ పండుగ కోసం హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని రెడ్డి గూడా కమాన్ వద్ద మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నరేందర్ చారి కాలు విరిగి తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేందర్ చారి మృతి చెందాడు. గ్రామంలోని కోట మైసమ్మ పండుగకు వస్తూ నరేందర్ చారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడు నరేందర్ చారి హైదరాబాద్ లో గ్రూప్ ఫోర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడిని, మృతునికి భార్య శైలజ 5 ఏళ్ల కూతురు కలదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జయప్రసాద్ తెలిపారు.

ఆ ప్లేస్‌లోనే ప్రమాదాలు ఎందుకు..?

మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి రెడ్డి గూడా కమాన్ వద్ద 167 వ జాతీయ రహదారి అంటేనే వాహన చోదకులు, మండల ప్రజలు హడలెత్తి పోతున్నారు. గత రెండేళ్ల కిందట ఇదే ప్రాంతంలో ఆటోను లారీ ఢీకొనడంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన 13 మంది కూలీలు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత గత రెండేళ్లలో అనేక ప్రమాదాలు వేరు వేరుగా ఇదే ప్రాంతంలో జరిగాయి. మొత్తంగా 8 మంది వరకు మృత్యువాత పడ్డారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఏమాయే..

గతేగాది కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇదే ప్రాంతంలో లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆ సమయంలో ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ ప్రాంతంలో రోడ్ క్రాసింగ్ ఉన్నందున ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, ఇక్కడ రోడ్ క్రాసింగ్ లేకుండా స్ట్రైట్‌గా చేస్తామని అప్పట్లో కొత్తపల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రోడ్డు నిర్వహణ గుత్తేదారునికి కూడా రోడ్ క్రాసింగ్‌ను సరిచేసి స్ట్రైట్‌గా రోడ్డు ఉండేలా చూడాలని ఆదేశించారు. కానీ, ఆ హామీ నేటి వరకు కూడా అమలు కాకపోవడంతో ఈ ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రజలు చనిపోతున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీ మేరకు రోడ్డు సరిచేసి తన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం కొత్తపల్లి గ్రామస్తులు రహదారిపై ధర్నా చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.


Next Story

Most Viewed