హైదరాబాద్‌లో లాడ్జీలు ఫుల్..ఎందుకంటే

by  |
హైదరాబాద్‌లో లాడ్జీలు ఫుల్..ఎందుకంటే
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌కు జిల్లాల నుండి వ‌స్తున్న నాయ‌కుల‌తో లాడ్జీలు ఫుల్ అయ్యాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప్ర‌ముఖ ప్రాంతాల్లో చిన్నా, పెద్దా లాడ్జీల్లో కూడా గ‌దు‌లు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. డిసెంబ‌ర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు జ‌రుగనున్న విష‌యం తెలిసిందే.

ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు గాను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వంటి ప్ర‌ధాన పార్టీలు జిల్లాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాయి. వారు న‌గ‌రంలోఉండేందుకు గాను లాడ్జీలను ముందుగానే బుక్ చేశారు. దీంతో ఇత‌ర‌త్రా ప‌నుల మీద న‌గ‌రానికి వ‌చ్చిన వారు లాడ్జీల్లో గ‌దులు లేక‌పోవ‌డంతో ఇబ్బందుల పాల‌వుతున్నారు.
రోజుల ముందు గానే…..
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో న‌గ‌ర నాయ‌కులతో పాటు జిల్లాల నాయ‌కత్వానికి కూడా ప్ర‌చార బాధ్య‌తను పార్టీలు అప్ప‌గించాయి. ఎలాగైనా పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకుని రావాల‌ని పార్టీల అధిష్టానాలు హుకుం జారీ చేయ‌డంతో జిల్లాల‌కు చెందిన నాయ‌కులు గ‌త కొన్ని రోజులుగా న‌గ‌రంలో మ‌కాం వేశారు. కేవ‌లం జిల్లాలలోని అగ్ర నాయ‌కులే కాకుండా వారి అనుచ‌రులూ న‌గ‌రానికి చేరుకుని ప్ర‌చారంలో కీల‌క బాధ్య‌త‌లు పోషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో లాడ్జీలలోని గ‌దుల‌ను బ‌ల్క్ బుకింగ్ చేసుకున్నారు. కొంత‌మంది నాయ‌కులు ,కార్య‌కర్త‌లు ఇంకా జిల్లాల నుండి రావ‌ల‌సి ఉన్నా… వారి కోసం కేటాయించిన గ‌దులు ఖాళీగా ఉన్నప్ప‌టికీ ఇత‌రుల‌కు యాజ‌మాన్యాలు అద్ధెకు ఇవ్వ‌డం లేదు. దీంతోన‌గ‌రంలో లాడ్జింగ్‌ల్లో గ‌దుల కొర‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా ర‌వాణా సౌక‌ర్యం బాగున్న నాంప‌ల్లి , కాచిగూడ , సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ల‌తో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ ప్రాంతాల్లో ఈ స‌మ‌స్య అధికంగా ఉంది.


Next Story

Most Viewed