లాక్‌డౌన్‌కు డ్రోన్ దన్ను

by  |
లాక్‌డౌన్‌కు డ్రోన్ దన్ను
X

దిశ, నల్లగొండ: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులతో సూర్యాపేట జిల్లా కేంద్రం వణికిపోతోంది. రెండ్రోజుల వ్యవధిలోనే 31 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని పరిస్థితిని గాడిన పెట్టేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే సూర్యాపేట పట్టణం మొత్తాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి నేరుగా ప్రజలను కలిసి భరోసా ఇస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ స్వయంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. డ్రోన్ కెమెరాలతో పట్టణవాసుల కదలికలతో లాక్‌డౌన్ అమలు తీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించారు. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కెమెరాలతో సిబ్బందిని అలర్ట్ చేశారు.
ఇంటికే నిత్యావసరాలు..

ప్రజలు నిత్యావసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇంటింటికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఒక్క నిత్యావసరాలే కాకుండా ఇతర అవసరాలను తీర్చేందుకు వార్డుల వారీగా ఇన్‌చార్జీలను నియమించారు. ఆ వార్డులోని అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఆ ఇన్‌చార్జుల మీద ఉంటుంది. దీనికితోడు మున్సిపల్ సిబ్బంది సైతం పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

బీబీగూడెంలో ఇంటింటి సర్వే..

చివ్వెంల మండలం బీబీగూడెంలో కొవిడ్ 19 పాజిటివ్ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్ కేసు బాధితుడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను సేకరించింది. సూర్యాపేట పట్టణంలో శనివారం ఉదయం నుంచి జిల్లా అధికార యంత్రాంగం అగ్నిమాపక యంత్రాలతో రెడ్ జోన్ ఏరియాలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. దాంతోపాటు పలు కాలనీల్లో ఇంటి యజమానుల అనుమతి తీసుకొని ప్రతి ఇంట్లో ఆ ద్రావణాన్ని పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 50 తైవాన్ స్ప్రే లతో క్లోరినేషన్ చేసేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.

పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో పాటు కరోనా వైరస్ సోకిన జిల్లాలో రెండో స్థానానికి చేరుకుంది. దీంతో సూర్యాపేటలో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ప్రకటించారు. అనుమానితుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతుండడంతో క్యారంటైన్‌ల సంఖ్య 4 నుంచి ఐదుకు పెంచినట్లు అధికారులు ప్రకటించారు.

మెడికల్ షాప్ యజమానులతో సమీక్ష

దుకాణాల యజమానులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలంటూ శనివారం సాయంత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు సమావేశం ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జలుబు, దగ్గుతోపాటు జ్వరంతో బాధ పడేవారు వైద్యులతో పనిలేకుండా నేరుగా మెడికల్ దుకాణాలకు వచ్చి మందులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలా కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి సమాచారాన్ని అధికారులకు అందేలా ప్రణాళికలు చేస్తున్నారు. పాజిటివ్ అనుమానంతో గోప్యత పాటించే వారిని టెస్ట్ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. అందుకు అనుగుణంగా త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

Tags: lockdown, covid 19 effect, house by house survey, camera, Surveillance


Next Story

Most Viewed