ఆదిలాబాద్‌లో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం..

by  |
ఆదిలాబాద్‌లో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం..
X

దిశ, ఆదిలాబాద్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న దరిమిలా దాన్ని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నది. మంగళవారం లాక్ డౌన్ విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పని చేస్తోంది. బుధవారం ఉదయం నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చాయి. ఇదే విధానాన్ని ఇలాగే కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘన చేసి బయటకు వచ్చిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలే జనసంచారం కనిపించలేదు. గల్లీల్లో కొందరు యువకులు నిబంధనలను అతిక్రమించి తిరగడం కనిపించింది.

మంత్రి అల్లోల మోటార్ సైకిల్ ర్యాలీ..

లాక్‌డౌన్ అమలును పరిశీలించడంతోపాటు కరోనా నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆయన మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

కాలినడకన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం కాలినడకన కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 6 ప్రభావిత జోన్లలో ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. సుమారు 15 కిలోమీటర్లు కలెక్టర్ కాలినడకన పర్యటించడం గమనార్హం. ఆయన వెంట పోలీసులు, అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా ఆయన హెచ్చరించారు. సంబంధిత ప్రాంతాల్లో బాధ్యతలు చూస్తున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ శ్రీ దేవసేన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి కరోనా ప్రభావంపై సమీక్షించారు. అదిలాబాదులో మొత్తం 21 మంది కరోనా బారిన పడగా వారందరికీ చికిత్స అందిస్తున్నారు వీరిలో ఐదుగురిని డిశ్చార్జి చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ..

నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు కరోనా ప్రభావం ఉన్న గ్రామాల్లోనూ బుధవారం లాక్ డౌన్‌ను పోలీసులు, అధికారులు కఠినంగా అమలు చేశారు. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి గ్రామమైన తానూర్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గ్రామం మొత్తాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. లక్ష్మణచాంద మండలం రాచపూర్, కనకాపూర్, పెంబి మండలం రాయ దారి, కడెం మండలం‌లోనూ లాక్ డౌన్ అమలుపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.

ప్రభావిత ప్రాంతాల్లో మళ్లీ సర్వే..

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్ర వారాల్లో మళ్లీ సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక ఖరారు చేసింది. బుధవారం టీకాల కార్యక్రమం కారణంగా సర్వేను నిలిపివేశారు. గురు, శుక్ర వారాల్లో కొనసాగించాలని నిర్ణయించిన అధికారులు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్‌లతో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. అలాగే మర్కజ్ లింకున్న 19 మందిని బుధవారం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

Tags: covid 19 affect, lockdown, restrictions, more, tightened, united adilabad district



Next Story