టీఆర్ఎస్ పార్టీకి స్థానిక తలనొప్పి..

by  |
trs leader
X

దిశప్రతినిధి, కరీంనగర్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన అధిష్టానానికి స్థానిక ప్రజాప్రతినిధులు షాక్ ఇస్తున్నట్టే ఉంది. ఓ వైపున బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంటే మరో వైపున నామినేషన్ వేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నామినేషన్ పత్రాల దాఖలుకు మరో రెండ్రోజుల సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 60 మందికి పైగా నామినేషన్ ఫారాలు తీసుకెళ్లారు. స్థానిక సంస్థలకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న ఆవేదన చాలా మందిలో నెలకొంది. నిధులు, అధికారాలు తదితర విషయాల్లో తాము వివక్షకు గురవుతున్నామన్న ఆవేదన వ్యక్తం అవుతోంది.

ఏకగ్రీవ ఎఫెక్ట్..?

ఇప్పటివరకు జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. దీంతో తమకు సరైన గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన కూడా స్థానిక ప్రతినిధుల్లో వ్యక్తం అవుతోంది. పోటీ లేకుండా పోయేసరికి తమకు గుడ్‌ విల్ కూడా దక్కడం లేదని మదనపడుతున్నవారూ లేకపోలేదు. మొదట్లో జరిగిన ఎన్నికల్లో క్యాడర్‌ను బట్టి గుడ్‌విల్ ఇచ్చారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమకు గుర్తింపుతో పాటు గుడ్‌విల్ కూడా దక్కాలంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమీతుమీకి సిద్ధం కావాలనే యోచిస్తున్నారు.

సిండికేట్..

నామినేషన్ వేసేందుకు అవసరమైన ప్రతిపాదకులు, అభ్యర్థి అంతా కూడా సమాలోచనలు చేసుకునే నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదకులుగా స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రమే కావాల్సి ఉంటుంది. దీంతో అందరం ఒకే తాటిపైకి వచ్చి సమరశంఖం పూరించాలని భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.

హుజూరాబాద్ ప్రభావం..

ఆరు నెలల పాటు నిరాటంకంగా ప్రచారం సాగిన హుజూరాబాద్ బై పోల్స్ ప్రభావం కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పడ్డట్టుగా ఉంది. అధికార పార్టీ హుజూరాబాద్ ఎలక్షన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను విస్మరించడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రభుత్వం అక్కడి ప్రజలు, నాయకుల డిమాండ్లను పరిష్కరించింది. అదే పద్ధతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వం అవలంభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఎన్నికలు మాత్రం అధిష్టానానికి తలనొప్పిని తెచ్చి పెడుతుందా అన్న చర్చ సాగుతోంది.


Next Story

Most Viewed