ఎద్దును ముద్దాడ‌నిది... ముద్ద దిగ‌దు

by Disha edit |
ఎద్దును ముద్దాడ‌నిది... ముద్ద దిగ‌దు
X

ఆకు అల‌ముల ప్రేమించు...

ఆలమంద‌ల ప్రేమించు...

పేగుబంధం ప్రేమించు....

ప్రేమ భూమండ‌ల ప‌రివ్యాపిత చ‌క్రబంధం

ప్రేమ... స‌మ‌స్త జీవుల కాల గ‌మ‌నం

గుండెల‌కు హ‌త్తుకున్నా ప్రేమ‌నే!

గుండెలు అవిసేలా మొత్తుకున్నా... ప్రేమ‌నే!

చెట్ల‌ను హ‌త్తుకో!... ప్రాణ వాయువు గుండెల్లోకి ప్ర‌వ‌హిస్తుంద‌న్నాడు - సుంద‌ర్ లాల్ బ‌హుగుణ‌

మృత్యువును హ‌త్తుకో... జీవితం విలువ తెలుస్తుంద‌న్నాడు - భ‌గ‌త్‌సింగ్‌

ఇప్పుడు.. ఊపిరి విలువ తెలియ‌ని వాడు

విశ్వాసాల‌కు విలువ తెలియ‌ని వాడు 'ఆవును హ‌త్తుకో' అంటున్నాడు

దిన వారాలు లేని ప్రేమ‌కు ఆవుతో ముడేసి... ఆలితో ముడేసి...

ప్రియురాలితో బంధించిన బ‌ల‌వంత‌పు కౌగిలింత‌ల ఈ కొండచిలువ ఎవ‌డు?

ఇంటికి పెద్ద కొడుకు ఆవు...

చంటోడికి అమ్మ‌పాలు ఆవు...

ప‌సిత‌నం ప‌ల‌వ‌రింత... ఆవు

కోడె వ‌య‌సు చిలిపిత‌నం ఆవు...

ఆవు నా నుండి విడిపోతే క‌దా!

ఇప్పుడు కొత్త‌గా హ‌త్తుకోవాల్సింది

ఆవు మూపు... వెచ్చ‌ని త‌ల‌దిండు దాపు

ప‌స‌రానికి నాలుగు గ‌రిక పోచ‌లు వేయందే ముద్ద అన్నం దిగ‌దు

కుడితి గోలెం చూసినంక‌నే... ప్రాణం నిమ్మ‌ల‌ప‌డుతుంది

గంగాళం నుండి నీళ్ళుతోడి కాళ్ళు క‌డ‌గాల‌ని అనిపిస్తది

లేగపిల్ల గర్వంగా గుండెల మీద నా ఇంట్లో

చెంగు చెంగున ఎగ‌రనిదే పొద్దు దొర్లిన‌ట్లు అనిపియ్య‌దు

ఆవు పెయ్య‌ల నెయ్యం ఏ వొయ్యిలో కెక్క‌ని

నెయ్యిని మించిన ఘుమ‌ఘుమ‌ల కావ్యం ఆవు...

వెన్నెల్లో ఆడ‌పిల్ల...గో ధూళి...ముసిరిన వాకిలి... సాంబ్రాని నిండిన పూజాగ‌ది

ఒక్క‌నాడు మేత తేనోడు... మంది మేత మేసెటోడు,

కుడితిలో చెయ్యిపెట్టి తౌడు క‌ల‌ప‌నోడు,

గ‌ర‌క మొయ్య‌నోడు, గ‌డ్డికుప్ప క‌ట్ట‌నోడు

గుడ్డి దీపంలో స‌మ‌రు పోయ్య‌నోడు,

గొడ్డుకు రోగ‌మొస్తే గుడ్ల‌ల్ల నీళ్ళు రానోడు

కండ్ల ముంగ‌ల ఎడ్లు బొక్క బొక్క అయితే

బుక్క దిగ‌క రంది ప‌డ‌నోడు

ఆవును హ‌త్తుకో అంటున్న‌డు...

ఇగో ఆల‌మంద‌లు తొక్కిన గిట్టెల ముద్ర‌లు

నా ఇంటి వాకిట్లో సంక్రాంతి ముగ్గులు

గంగిరెద్దు నా గుండెల‌పై ఎంత సుతారంగా

పాదం మోపుత‌దో ఒక్క‌సారి అవ‌లోకించు

ఇదిగో... ఆవును హ‌త్తుకున్నా...

ఆవుతో ఆలింగ‌నం అమ్మ‌వొడి క‌దా!

ఆవును ఆహార‌మ‌ని అనాదిగా

ఆచ‌రిస్తున్న‌వాన్నీ... హత్తుకున్నా....

వాడిది జీవ‌న‌వేదం క‌దా!

ఆవును సాదుకున్న‌ది వాడే... ఆర‌గించింది వాడే...

ప‌శు పోష‌ణ వాడిదే... ప‌శు భ‌క్ష‌ణ వాడిదే...

లందెలో నాన‌బెట్టిన చ‌ర్మ‌మంటావా?

నీ పాదాల‌కు అల్లుకున్న పాద‌ర‌క్ష‌లురా!

దండేనికి క‌ట్టిన ఎండిన ఎద్దు తున‌క‌లంటావా?

ఊర‌వుత‌ల ఇండ్ల‌ల్లో కోట్లాది మాన‌వులకు ర‌క్త‌మాంసాలు

ధ‌ర్మ‌వ్యాధున్ని అడుగు... ధ‌ర్మ సూక్ష్మం చెపుతాడు

ఏద వ‌ధ‌? ఏది ధ‌ర్మం వ‌ధ‌?!

మ‌ధ్యలో గోమాత ముచ్చ‌ట ఎక్క‌డిదిరా?

గో ర‌క్ష‌ణ గోల ఎక్క‌డిదిరా?

ద‌శావ‌తారాలు దాటి కొత్త‌గా మొలిచే

దేవ‌త కాదు... ఆవు...

ఆవు... మా అమ్మ‌...

ఆవు... మా ప‌నిముట్టు...

ఆవు... మా ప‌ట్టుగొమ్మ‌

ఆవు... అంతులేని ప‌శు సంప‌ద‌...

ఆవు... ఇంటింటి ప‌సిడి పంట‌

ఆవు ఇంటికి నిట్టాడు...

అన్ని అవ‌తారాలు ఆవే...

ఆవు, ఎద్దు, బ‌ర్రె, దున్న అన్నీ గోవులే

ఆల‌మంద‌ల తావులే నా ఇల్లే గోశాల‌...

ప‌సుల కొట్టంలో ప‌సులు... ప‌సిపోర‌లు ప‌సిడి కొమ్మ‌లు

దా! ముందు క‌రువు బారిన ప‌డ‌కుండాన

ఆవు క‌బేళాకు పోకుండా కాపాడుకుందాం

హ‌త్తుకోవ‌డ‌మంటే... నెత్త‌రులో భాగం

చేసుకోవ‌డ‌మే... విత్త‌నంగా కాపాడ‌డ‌మే!

విత్త‌నం ఆహార‌మ‌యినంత స‌హ‌జం....

ఏ జీవైనా ఆర‌గించ‌డానికి సిద్దాన్న‌మే

నాకు వ‌రాహ అవ‌తారం, కూర్మావ‌తారం,

మూషిక వాహ‌నం, నెమ‌లి వాహ‌నం,

అశ్వ‌మేదం, ఐరావ‌తం, జ‌టాయువు, హిర‌ణ్యాక్షుడు, గో గ్ర‌హ‌ణం,

గోవ‌ర్ధ‌నం మ‌త్స్య‌వ‌తారం, మ‌హిషం, మ‌హాసాధువు గోవు...

స‌మ‌స్త జీవ రాశి ప్ర‌తిరోజు పూజ‌రాశినే...

ఈ ప్రేమికుల రోజు...

సుతారంగా నా ఆవు మోపును ముద్దాడ‌నీ!

గ‌జ్జెల దండ‌ను స‌వ‌రించనీ!

కొమ్ముల‌కు రంగులేసి సింగారించ‌నీ!

ఆవు... సౌందర్య క‌ళాశాల... ఇంద్ర నీలావ‌తి

నీకు ర‌చ్చ చేసుడు కాక... ర‌క్షించ‌డం రాదు

చెమ‌టోడ్చ‌నోడు... ఎద్దులా క‌ష్టం

చేసుటోడికి ఆవు విలువ చెప్పుత‌డు

క‌డుపులో స‌ల్ల క‌ద‌ల‌నోడు

జీవ‌హింస రాగ‌మెత్తుకుంట‌డు

రైతు కంట క‌న్నీరు తుడువు... గోవు మురుస్తది

రైతు గుమ్మిలో దాన్యం ఉండేట్టుచూడు...

గోవు శ‌నార్తులంట‌ది

ప్రేమికుల రోజు...

జీవుల్ని ఎడ‌బాటు చేసే రోజు కాద‌ని తెలుసుకో.

కులాన్ని విడ‌దీసి న‌న్ను క‌డ‌గొట్టుకు నెట్టిన‌ట్లు

మూగ జీవాల్ని విడ‌గొట్ట‌కురా!

ఆవు ఒక్క‌టే కాదు... స‌క‌ల జీవ‌రాశిని హ‌త్తుకుందాం.

దోసిల్ల నిండా ప్రేమ‌ను రాసి పోయ్యి...

ప్రేమికుల రోజు ఆకాశం నిండా హృద‌యాకృత న‌క్ష‌త్రాలే.

(ఆవును హ‌త్తుకో... అంటున్న సరికొత్త రాజకీయంపై జాజ్వల్య కవిత.. ప్రేమికుల రోజు సందర్భంగా)

డా. చెరుకు సుధాక‌ర్‌

9848472329



Next Story