మనిషి అంతరంగ తాత్విక మనో సీమల శోధన

by Disha edit |
మనిషి అంతరంగ తాత్విక మనో సీమల శోధన
X

చైనీయ సంస్కృతిలో కన్ఫ్యూషియస్, భారతీయ సంస్కృతిలో భర్తృహరి, దక్షిణ భారత తమిళ సంస్కృతిలో తిరుక్కురల్ గురించి తెలియకపోవడం ఉండదు. ఒక జాతి ఆత్మ తాలూకూ ప్రతిధ్వనుల్ని జీవితానుభవంతో, వాళ్లు చూసిన సమాజానుభవంతో ప్రపంచాన్ని వ్యాఖ్యానించే పని చేసిన వారిలో ఒకే కోవకు చెందిన వాళ్లుగా వీళ్ళని పేర్కొనవచ్చు. సమాజ భ్రష్టత్వాన్నీ, మానవీయ హీనతనూ ఇంకా అనేక ముఖాల జీవన వైవిధ్యాలనీ తరచి తరచి చూస్తూ లోతైన, గాఢమైన అనురక్తితో నిరపేక్ష సత్యాలన్నంత గొప్పగా, ప్రపంచాన్నీ, ప్రపంచ దుఃఖాలనీ, వైరుధ్యాల్ని చెప్పిన వైనం చూసినప్పుడు అబ్బుర మనిపిస్తుంది. గొప్ప తాత్విక భూమిక ఉన్న ఇటువంటి వారి వ్యాఖ్యానాలను నిరపేక్షంగా యావత్ సమాజాలకూ అన్వయించి చూడటంలో తప్పులేదు కానీ అవి అక్షర సత్యాలే సుమా అని భావించటం మాత్రం అభ్యంతరకరమే అవుతుంది. గొప్ప వ్యక్తుల మాటల విలువ విషయాల్ని సాపేక్షంగా చూసినప్పుడే వాటి అసలైన విలువ బోధపడుతుంది. మంచి మాట కానీ, గొప్ప వ్యాఖ్య గానీ నిజానికి సర్వకాల సర్వావస్థల్లోనూ, సర్వ మానవాళికీ ఒకే రకపు అన్వయింపు షరతులు లేకుండా ఉండడం అరుదు.

అతి పురాతన గ్రంథం

తిరువళ్ళువర్ చూసిన ప్రపంచపు జీవితానుభవాల సారం తిరుక్కురల్. తమిళ ఆత్మతో మమేకమైన ఈ మహాగ్రంథం గురించి కరుణానిధి, “హిమాలయ పర్వతానికి బంగారు శాలువా కప్పడానికి ప్రయత్నించడమూ, తిరుక్కురల్‌కు వ్యాఖ్యానం రాయడమూ ఒకటే” అంటారు. కరుణానిధి తనకున్న హేతువాద దృక్పథంతోనే వ్యాఖ్యానానికి పూనుకోవటం గొప్ప విషయం. 133 అధ్యాయాలతో 1330 ద్విపదలో వ్రాసిన (మొదటి పాదంలో నాలుగు గణాలూ, రెండో పాదంలో మూడు గణాలూ) ఈ పద్యాలు ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో మార్మోగుతాయి. ఇది భారతీయ సాహిత్యంలోనే అతి పురాతనమైన గ్రంథంగా భావించబడుతోంది. అప్పటికి ధర్మార్థ కామ మోక్షాల గురించి రాయడమే ఆనవాయితీ. జాతి మత విభేదాల్లేని, ఆర్థిక అంతరాల్లేని దార్శనికతను కలిగి ఉండటంతోపాటు, స్త్రీలను తక్కువ చేసే అభిప్రాయాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ రచనను పెరియార్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళారు. 40 కి పైగా విదేశీ భాషల్లోకి అనువాదమైన ఈ గ్రంథాన్ని టాలస్టాయ్, ఆల్బర్ట్ స్విట్జర్, ఫాదర్ బెస్కి జి. యు పోప్‌లు ప్రశంసించటం చూస్తాం. మచ్చుకు కొన్ని ద్విపదలు మీ కోసం.

కాక్క పొరుళా అడక్కత్తై, ఆక్కం

అదినినూ ఊంగు ఇల్లై ఉయిర్కు.

(స్థిరమైన హృదయంతో పరిరక్షించుకోవలసింది వినయం. వినయం కన్న ఉన్నతమైనది వేరొకటి లేదు.)

ఒళుక్క ముడైయ వర్కు ఒల్లావే తీయ

వళుక్కియుం వాయాల్ సొల్ల,

(పొరబాటుగానైనా సరే సత్ప్రవర్తన కలిగినవాళ్లు ఇతరుల గురించి చెడ్డమాటలు చెప్పరు. అది వాళ్ల స్వభావం.)

ఒత్తదు అఱివాన్ ఉయిర్ వాళ్ వాన్; మట్రైయాన్

సెత్తారుళ్ వైక్క ప్పడుం.

(ఇతరులకోసం తన జీవితాన్ని అర్పించినవాడే జీవించి ఉన్నవాడు అని చెప్పబడుతాడు. దానికి విరుద్ధంగా నడుచుకున్నవాడు మరణించిన వాడవుతాడు.)

పాత్తూణ్ మరీ ఇ యవనై వృసి ఎన్నుం

తీప్పిణి తీణ్డల్ అరిదు.

(ఇతరులతో కలసి పంచుకొని తినే అలవాటు ఉన్నవాళ్లకు 'ఆకలి' అనే భయంకరమైన వ్యాధిరాదు.)

ఆట్రువార్ ఆట్రల్ పసి ఆట్రల్ అప్పసియై

మాట్రువార్ ఆట్రలిన్ పిన్.

(ఆకలిని ఓర్చుకోగల వ్రతాలు పాటించడం కన్న ఆకలితో అల్లాడుతున్న వాళ్లకు అన్నం పెట్టడమే మేలైనది.)

ఒన్జానుం తీచ్చొల్ పొరుట్ పయన్ ఉన్డాయిన్

నన్రు ఆగా దాగి విడుం.

(ఒక కడవ పాలలో ఒక చుక్క విషంలాగ మాట్లాడే మాటల్లో ఒక చిన్న మాట చెడ్డమాటగా పొరబాటుగా దొర్లితే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ మాటల్లో ఉన్న మంచి అంతా చెడ్డగా మారిపోతాయి.)

అఱివినాన్ ఆగువదు ఉన్డో పిఱిదిన్ నోయ్

తమ్ నోయ్ పోల్ పోట్రాక్కడై.

(ఎదుటివారికి వచ్చే కష్టాలను తన కష్టాలుగా భావించి వాళ్లను ఆదుకోవడానికి ముందుకు రానివాళ్లు ప్రజ్ఞావంతులైతే మాత్రం ఏం ప్రయోజనం)

సగైయుం ఉపగైయుం కొల్లుం సినత్తిన్

వగైయుం ఉళవో పిర

(కోపగించుకున్న వాళ్లకు ముఖ వికసనం మాత్రమేకాదు. మానసికానందం కూడ దూరమవుతుంది.)

ఐయత్తిన్ నీంగి త్తెళిన్దార్కు వైయత్తిన్

వానం నణియదు ఉడైత్తు.

(సందేహాలను సక్రమ పరిశోధనల ద్వారా తొలగించుకున్నవాళ్లకు భూమికన్న ఆకాశం చాలా దగ్గరగా ఉన్నదనే భావన కలుగుతుంది.)

సుణ్మాణ్ సుళైవులం ఇల్లాన్ ఎల్లిల్ సలం

మణ్మాణ్ వునై పావై యట్రు

మనోహరమైన ఆకారం మాత్రమే కలిగి, గాఢమైన పాండిత్యం లేనివాళ్లు వట్టి కళ్లను మాత్రమే ఆకర్షించే మట్టి బొమ్మలను పోలిన వాళ్లుగా పరిగణింపబడతారు గానీ గౌరవింపబడరు.

విలంగొడు మక్కళ్ అనైయర్ ఇలంగు నూల్

కట్రారోడు ఏనైయవర్.

(మానవులకు జంతువులకు మధ్య ఏమీ భేదం ఉందో అదే భేదం విజ్ఞాన దాయకములైన గ్రంథాలను చదివిన వాళ్లకు,ఆ గ్రంథాలను చదవని వాళ్లకు మధ్య ఉంది.)

అరంగు ఇన్రి పట్టు ఆడి యట్రే నిరంబియ

నూల్ ఇన్రి క్కోట్టి కొళల్.

(పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించకుండా సభలో మాట్లాడ్డం గడులు గీయని చదరంగం బల్లమీద పావులు జరపడానికి ప్రయత్నించడం వంటిది.)

తిరుక్కుఱళ్ అంటే పవిత్ర వచనమనే అర్థం ఉన్నప్పటికీ ఇది దైవభక్తి సంబంధమైన రచన కాదు. సత్యం, అహింస, నిగ్రహం, కృతజ్ఞత, ఆతిథ్యం, దయ, ఉదారత, జ్ఞానం లాంటి పలు వ్యక్తిగత విలువల ప్రబోధంతో పాటూ అనేక రాజకీయ, సామాజిక విషయాల ప్రస్తావన కూడా ఈ రచనలో కనిపిస్తాయి. తమిళంలో కరుణానిధి భాష్యంతో వచ్చిన తిరుక్కుఱళ్‌కు ఇది ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ చేసిన తెలుగు అనువాదం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ దీన్ని ప్రచురించింది.

ప్రతులకు

గ్రంథం : తిరుక్కురళ్

రచన : తిరువళ్లువర్

వ్యాఖ్యాత : ఎం. కరుణానిధి

అనువాదం : శ్రీపాద జయప్రకాశ్

పుటలు : 352 / వెల : రూ. 350

ప్రచురణ : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

సమీక్షకులు

వి. విజయకుమార్

85558 02596



Next Story

Most Viewed