మన కాలపు సాహిత్య విప్లవకారుడు..

by Ravi |   (  Updated:2026-06-29 00:45:45  IST  )

Sky Baba is The literary revolutionary of our time...

మన కాలపు సాహిత్య విప్లవకారుడు..
X

భారతదేశ ముస్లిం మైనారిటీ సాహిత్యంలో స్కైబాబ పాత్ర విభిన్నమైనది.. కారణం ఆయన ముస్లింల సమస్యలను కేవలం మతపరమైన మైనారిటీ కోణం నుండి చూడకుండా, భారతదేశ సామాజిక, రాజకీయ, బహుజన కోణాల నుండి విశ్లేషించారు. తెలుగు నేలపై ముస్లింల భావజాలానికి అక్షర రూపం ఇచ్చి, వారిని సాహిత్యానికి 'వస్తువు'గా మాత్రమే కాకుండా, 'సృజనకారులు'గా నిలబెట్టిన ఘనత స్కైబాబాది.

మహాశ్వేతాదేవి గిరిజనుల కోసం, ఓంప్రకాష్ వాల్మీకి దళితుల కోసం మనదేశంలో సాహిత్యాన్ని ఎలాగైతే ఒక పోరాట రూపంగా మార్చారో.. తెలుగు నేలపై ముస్లింల హక్కుల కోసం, వారి ఆత్మగౌరవం కోసం సాహిత్యాన్ని అంతటి శక్తివంతమైన ఉద్యమంగా మార్చిన 'సామాజిక సాహిత్య విప్లవకారుడు' స్కైబాబ. అందుకే ఆయన కేవలం తెలుగు కవి మాత్రమే కాదు, భారతీయ అస్తిత్వ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి.

ప్రాంతీయ ముస్లిం రచయిత స్థాయి దాటి...

మన దేశంలో దళిత, బహుజన, మైనారిటీ రాజకీయాల మధ్య ఒక సాహిత్య సంభాషణను నిర్మించిన అతి తక్కువ రచయితల్లో ఆయన ముఖ్యుడు. అందుకే ఆయన రచనలు కేవలం ముస్లిం సాహిత్యం కాదు. తెలుగు సబాల్ట్రన్ వర్గాల రాజకీయ-సాంస్కృతిక ముఖచిత్రంలో భాగం. భారతీయ సాహిత్యంలో స్కైబాబ స్థానం “ప్రాంతీయ ముస్లిం రచయిత” స్థాయిని దాటి ఉంటుంది. ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టేది.. భారతదేశ మైనారిటీ అనుభవాన్ని, ముఖ్యంగా ముస్లిం జీవితంలోని రాజకీయ అభద్రత, అస్తిత్వ సంక్షోభం, భాషా సంస్కృతిని దక్షిణ భారత ప్రజాసాహిత్య భాషలో వ్యక్తీకరించిన సాహిత్యకారుడు.

సాహిత్య చర్చలో ముస్లిం బస్తీ జీవితం

సాదత్ హాసన్ మంటో విభజన తర్వాత ముస్లిం మనస్తత్వాన్ని ఎలా తన రచనల్లో వ్యక్తీకరించాడో, స్కై బాబా బాబరీ మసీద్ పతనానంతర భారతదేశంలో ముస్లిం పౌరుడి మానసిక అస్థిరతను తెలుగు భాషలో అద్భుతంగా వ్యక్తీకరించాడు. మహాశ్వేతా దేవి ఆదివాసీ జీవితాన్ని “సబ్జెక్టు ” నుంచి “పొలిటికల్ ప్రెసెన్స్”గా మార్చినట్లే, స్కైబాబ తెలుగు ముస్లిం బస్తీ జీవితాన్ని సాహిత్య-రాజకీయ చర్చలోకి తీసుకొచ్చాడు.

ముస్లిం సాహిత్యానికి యూనిక్ కాంట్రిబ్యూషన్

స్కైబాబ రచనలను భారతీయ “సబాల్ట్రన్ సాహిత్య ” సంప్రదాయంలో చదవాలిచూడాలి.. దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ అస్తిత్వ రచనల సరసన. అంటే ఆయన కేవలం ఐడెంటిటీ రైటర్ కాదు. భారతదేశ ప్రజాస్వామ్య విరోధాభాసలను స్కేర్న్ తీసి పటం కట్టి చూపిన రచయిత. భారతీయ ఆంగ్ల అకడమిక్ వర్గాల్లో “Muslim marginality”, “minority discourse”, “vernacular resistance” వంటి మేధో చర్చలకు తెలుగు నుంచి ఒక స్పష్టమైన స్వరం ఇచ్చిన రచయితల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా, ఉత్తర భారత ఉర్దూ ముస్లిం అనుభవం ఆధిపత్యంలో ఉన్న భారతీయ ముస్లిం సాహిత్యానికి, దక్షిణాది-తెలుగు ముస్లిం జీవనాన్ని పరిచయం చేసి భారతీయ ముస్లిం సాహిత్యానికి ఒక పరిపూర్ణతను పరిపుష్టతనూ యిచ్చాడు. ఇది చాలా యూనిక్ కాంట్రిబ్యూషన్. స్కైబాబ సాహిత్యమంతా మొత్తం దక్షిణ భారత ముస్లిం సైకీని స్పష్టంగా. సమానంగా ప్రతిఫలిస్తుంది.

సాహిత్యంలో కీలక మైనారిటీ స్వరం..

స్కైబాబ భారతీయ సాహిత్యంలో ఒక కీలక మైనారిటీ స్వరం. ఆయన రచనలు ముస్లిం జీవితాన్ని కేవలం వ్యక్తీకరించడమే కాదు దానికి స్వీయ భాష, స్వీయచరిత్ర, రాజకీయ గౌరవాన్ని ఇచ్చాయి. తెలుగు సాహిత్య అంచులలో సంచరిస్తున్న ముస్లిం అనుభవాన్ని కొసలనుంచి కేంద్రానికి తీసుకువచ్చి, భారతీయ సబాల్ట్రన్ వర్గాల సాహిత్య పరంపరలో ఒక ప్రత్యేక స్థానం పొందారు. స్కై బాబా రచనలు ప్రాంతీయ సాహిత్యాన్ని దాటి, భారతదేశ ప్రజాస్వామ్యపు సామాజిక సత్యాలను నమోదు చేసిన సాహిత్య సాక్ష్యాలుగా నిలుస్తాయి. జాతీయ స్థాయిలో మన సాహిత్యకారులని చూడ్డం ఎప్పుడో మానేసాం మనం. తన సాహిత్యాన్ని తులనాత్మక పరిశీలనా చేసిన రోజు స్కై బాబా రచనల విలువా, బలం తెలుగు ఉష్ట్రపక్షి విమర్శక మేధావులకు తెలిసొస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

-మోత్కూరు శ్రీనివాస్

కవి, రచయిత

Next Story