కవిమాట: కాలం విప్పని కథ

by Disha edit |
కవిమాట: కాలం విప్పని కథ
X

అద్భుతాలు ఒకవైపు నుంచి

ఎడతెగని తుఫానులో

సుడులు తిరుగుతూ

ఎటు పడతాయో తెలియని

వాంఛల లోతట్టుల్లో

కసిలో ఉన్మాదావస్థల

సున్నితత్వం ముసుగులో

మూలుగుతూ ఉంటాయెప్పుడూ

ఒక్కోమారు కన్నులు

సరిహద్దుల్లో పొలాల్లో పచ్చికల్లో

సూర్యుడు భూమిలోపలికి

పడమటి కొసలో దిగడాన్నే

గుర్తించుకుని ఊరట పొందుతాయి

ఒక దినం పోతుంది పోగొడతాం

ఒక ఉదయాన్ని మన

నిద్రలో చుట్టుకుంటాం

విధిలేక అరుగుపై వీధికుక్క ఒకటి

వెనకటికి మరణించిందంట

తన పిల్లలపై బెంగతో...

ప్రతిసారి చలికాలంలో

తన పుట్టిన పిల్లలన్నీ చనిపోవడంతో

చలితోనూ వీధిలో నుండి వెళ్ళే

వాహనాల కింద పడీననూ...

చివరికి ఆ వీధికి 'కుక్కపిల్ల సందు'

అని పేరు పెట్టారంట-

ప్రతిసారీ ఇదంతా చూస్తూ

పోయిన మనుషులేమో!

కాలం ఋతువులు కూడా

దేన్నో తెస్తాయో ఇస్తాయో

పరోక్షంగా చెబుతాయో

వదులుతాయో పట్టుకుంటాయో

సాయం చెస్తాయో చోద్యం చూస్తాయో

మన గోడు వింటాయో

తోడు ఉంటాయో

ఎప్పటికీ విప్పని పొడుపుకథే!

రఘు వగ్గు

9603245215



Next Story