ఇరుసు

by Disha edit |
ఇరుసు
X

నీ పుట్టుకతో ఎన్నో స్వప్నాలకు మొగ్గ తొడుగుతావు

విభిన్న పాత్రల్లో జీవిస్తూ

నువ్వొక అలుపెరుగని నదిలా ప్రవహిస్తుంటావు

కన్నవారి శిలువను మోస్తూ

బాల్యంతో కుస్తీ పడతావు

అనేకానేక ఆశయాల సాధనకై

మేధస్సుని చెమటగా అర్పిస్తావు

ఎన్నో ప్రయత్నాల మాటున

వ్యక్తిగత ఓటములు ఎన్నున్నా

ఋతురాగాన్ని మరచి రాత్రనక పగలనక

నిత్య చైతన్యమై లక్ష్యాలను ఛేదిస్తావు

మూడు ముళ్ల బంధంతో

ఏడడుగులు నడిచిన అనుబంధానికి

తల్లితోడ వారధియై నిలిచి

సయోధ్యకై నువ్వే నలిగి నలిగిపోతావు

ఎటువంటి ఆపదొచ్చినా నేనున్నానని

గొడుగు పట్టే భరోసా వాక్యమౌతావు

నువ్వొక సైన్యమై రేపటి సమరానికి

నిద్ర లేని రాత్రులెన్నో గడుపుతావు

ఒకేసారి వచ్చే పిల్లవాని స్కూల్ ఫీజు

భార్య పుట్టిన రోజు, తండ్రి మందుల ఖర్చు,

వీటిలో నీవారికై నిలబడతూ

లోగిలిలో ఆర్థికంగా తలబడతావు

నీ వాళ్లు, నీ చుట్టూ ఉన్నవాళ్లు

నీ ఓటమిపై రాయెట్టి కొట్టినా

నువ్వు పచ్చ పచ్చని చెట్టులా

నీ ఫలాల తేనెపట్టుని వారి దోసిళ్లలో పోస్తావు

అలసినా సొలసినా విశ్రాంతిని మరిచి

నీ వారికై నువ్వు నిలబడతావు..

ఎదుర్కొన్న ఓటముల సాక్షిగా

ముక్కలైపోయిన కలలను నీలోనే సమాధి చేస్తావు

నువ్వు సాధించినప్పుడల్లా

మరిన్ని ఆశలను బుజాన వేసుకుని

నీలో నువ్వు ఏడ్చేసిన ఒంటరి క్షణాలను

ఫణంగా పెట్టి విజయ బావుటా ఎగరేస్తావు..

నీ ఓటములన్నీ నీ వ్యక్తిగతం

నీ విజయాల ఫలితాలు అందరి పరం..

ఈ సమస్త కుటుంబ భాధ్యత చక్రానికి

నలిగిపోయిన నువ్వొక ఇరుసు


డా. వాసాల వరప్రసాద్

కరీంనగరము, 94901 89847



Next Story