సత్యాగ్ని దహితుడు!

by Disha edit |
సత్యాగ్ని దహితుడు!
X

లోకం అంటేనే ఓ ఆకలి వేట!

కూరగాయలను పెంచే చేతుల

మధ్య పెరిగిన వాడు కదా

అనాది అంధ విశ్వాసపు

జలగల రక్త దాహానికి చిక్కి

బక్కచిక్కిన అమాయకపు దేహాలకు

ప్రశ్నల పోషకాలను అందించి

బలవర్ధకం చేసినాడు....

సమాజం అంటేనే ఓ సబ్బండ జాతుల తోట!

పండ్లను పండించడం అనే విద్యను

పుట్టుకతోనే ఔపోసన పట్టిన

తోటమాలి కదా

జ్ఞానపు ఆకలిని తీర్చే

ఆలోచనల పండ్లను పండించాడు...

దేశం అంటేనే మట్టి మనుషుల బాట!

అమ్మను, అమ్మలాంటి ఆడాళ్లను

చూస్తూ ఎదిగిన వాడు కదా

అక్షరాన్ని అక్కున చేర్చుకోలేని మహిళల కోసం

భిడే వాడను బడి వాడగా మార్చి

తొలి అడుగు వేసి వెలుగు జాడ అయినాడు....

సమత అంటే కులాధిపత్యాలకు

గోరీ కట్టడమే అని,

మమత అంటే మహిళలకు

కుర్చీ ఇవ్వడమేనని,

మానవత అంటే సకల జనులు

జ్ఞానపీఠంపై నిలవడమేనని

కలగన్న వాడు.. కలత చెందిన వాడు..

కార్యాచరణ చేసి కలకలం

రేపిన వాడు అతడు....

పాశ్చ్యాత్య Rights of Man ను ఆకళింపు చేసుకొని

దేశీయ గులాంగిరిని దిగంతాల దాకా పారద్రోలాలని

విద్యా శంఖం పూరించిన అక్షర యోధుడు అతడు...

అగ్రవర్ణాలు, ఆర్యులు, ఆధిపత్య వాదులను

హక్కుల సోయితో పటాపంచలు చేసిన

విప్లవ తాత్వికుడు అతడు...

వామనుడి లోని విలనిజాన్ని

బలిలోని హీరోయిజాన్ని సాధికారంగా చెప్పి

వర్ణపు నిచ్చెనలోని కడగొట్టు మెట్టుకు

దళిత శస్త్రాస్త్రాలను అందించి

ధిక్కారాన్ని నేర్పించిన కార్యకారణ

దార్శనికుడు అతడు...

అతడు సత్య శోధకుడు... సమానత్వ ప్రేరకుడు!

సత్య సాధకుడు... సత్వ తత్వ చోదకుడు!!

అతడు జ్యోతిబా...!

బహు వర్ణాల సూర్యుని అగ్ని బావుటా!!

- డా. మామిడి హరికృష్ణ

80080 05231



Next Story