ఈ దేశపు రైతు వాడు!

by Disha edit |
ఈ దేశపు రైతు వాడు!
X

ఋతువు రాగానే వాడు

బడి గేటు ముందు

బెత్తానికి వెరవని బడి పిల్లాడిలా

పురుగుల్ని చంపలేని

పురుగు మందు కొట్టు ముందు

బుద్ధిగా నిలబడే పిచ్చిమారాజు

తొలకరి చినుకుల చురకలు

పలకరించిన రోజే పులకరిస్తూ

ఐసు బండి వెంట ఉరికే

పసివాడై మొలకెత్తని

విత్తనాల కొట్టు ముందు

వేచి చూసేవాడు

దున్నుతూ - తడుపుతూ - తడుస్తూ

ఎండుతూ - వాడుతూ - ఒడ్డుతూ

నిరంతరం ఓడుతూ

బతుకు బండి లాగేవాడు

పండిన రాజనాల్లాంటి గింజల్ని

పంది కొక్కుల గాదెల్లో నింపే

పాలకడల్లాంటి మార్కెట్ యార్డులో

యే రాతి తల్పం మీదో

ఎంతకూ రాని వంతు కోసం

వేచి వుండే క్షుధానల దగ్ధ మూర్తి వాడు

లక్ష్మీదేవి దరిచేరని విష్ణుమూర్తి వాడు

అడిగితే లేదనకుండా

ఇవ్వడమే తెలిసిన వాడు

భూమి తల్లి శపించిన కర్ణుడు వాడు

అలగడం మర్చిపోయిన ధర్మరాజు వాడు

వంటి మీదే కాదు ఇంటి మీదే కాదు

పండిన పంట మీద కూడా

ఇంత ఆచ్ఛాదనకు నోచుకోని

నిరుపేద రారాజు వాడు

ఈ దేశపు వెన్నుముకని

నిటారుగా నిలబెట్టడం కోసం

రోజూ వెన్ను విరుచుకు పోరాడే

భూమిలేని భూమీశుడు వాడు

నిరంతరం ఓడిపోతూ కూడా

ఈ దేశపు బతుకు కోసం

అనుక్షణం చచ్చేవాడు

ఈ దేశపు మెతుకు కోసం

కాడిని శిలువలా మోస్తూ

తిరిగే రక్షకుడు వాడు

ఋతువు రాగానే

పునరుత్థానం పొందే

దేవుడు వాడు

ఈ దేశపు రైతు వాడు

వి. విజయకుమార్

85558 02596



Next Story

Most Viewed