ఆయన్ని పలకరించాలి...!

by Disha edit |
ఆయన్ని పలకరించాలి...!
X

ఆయన్ని పలకరించాలి.

ఆయన్ని ఇంటికోరోజు తీసుకురావాలి !

కమ్మటి భోజనం వడ్డించాలి.

కూతురు.. కొడుకు మాట్లాడక యుగాలైనాయట

భార్య పోయి రెండేళ్ళయింది.

భార్య పోతూ.. పోతూ మాటలు..

పలకరింపులు చాలానే మిగిల్చి వెళ్ళిపోయిందట..

వాటిని ఈయన మనసు తిజోరీలో

భద్రంగా దాచున్నాడట..

ఎవరూ పలకరించనప్పుడు..

ఎలా ఉన్నావని అడగనప్పుడు...

గది తలుపులు మూసి.. తిజోరీని తెరిచి..

భార్యతో మాట్లాడుతూ ఉంటాడు !

తిండి టైంకి తింటున్నా అని..

మందులు వేసుకుంటున్నా అని..

రోజూ వాకింగ్..ధ్యానం చేస్తున్నా

అనీ చెబుతుంటాడు.

'నువ్వేమీ బాధపడకు..

అబ్బాయి రోజూ పలకరిస్తాడు..

మొన్న నా ఎనభై మూడవ

పుట్టినరోజుకి వచ్చాడు కూడా..

ఇక్కడ అందరికీ సరిపోయేంత పెద్ద కేక్...

నాకు బట్టలు..మందులు ఇచ్చివెళ్లాడు..

నువ్వేమీ బెంగపడకని కమ్మని అబద్దాలు..

వెచ్చని కన్నీళ్లు దాచుకుంటూ

మరీ చెబుతుంటాడు.

తాను ఉంటున్న చోట సౌకర్యాల గురించి..

తన బీపీ చెక్ చేసే డాక్టర్ గురించి..

అక్కడి యోగా క్లాసుల గురించి

తన పక్క గదిలోని కౌసల్య గారి

వీణ ప్రాక్టీస్ గురించి..

రోజూ తాగి తన్నే భర్త పోయాకే

తన ఈ మిగిలిన జీవితం చాలా బాగుందని

నిక్కచ్చిగా చెప్పే ఊర్మిళా దేవి గురించి.,

మూడో అంతస్తులో ప్రొఫెసర్‌కి వచ్చిన

హార్ట్ ఎటాక్ గురించి..గంటలు గంటలు

చెబుతూనే ఉంటాడు.

ఉన్నట్లుండి..ఆమెకి ఇష్టమైన

"ఆజ్ జానే కి జిద్ నా కరో ..

మేరే పెహలూ మే బైఠా కరో"

అంటూ ఫరీదా బానో గజల్‌ని

బలహీనంగా ఎత్తుకుంటాడు..

మధ్య మధ్యలో పాటలోని వాక్యాలు

దుఃఖంతో విరిగిపోతుంటాయి..

తిరిగి కష్టం మీద గుర్తుకు చేసుకుని

అతకబెట్టుకుంటూ సన్నగా

వొణుకుతున్న గొంతుతో.,

పార్కిన్సన్స్ వ్యాధితో మెల్లగా ఊగుతున్న

తలతో ముగిస్తుంటాడు..ఏదో ఒక పాట..

ఆమె బతికి ఉన్నప్పుడు

ఇద్దరూ కలిసి విన్న పాటలు ..

ఇద్దరినీ కలిపి ఉంచిన పాటలు.

ఇదంతా వేదిక మీద ఆయన చేసే

ఏకపాత్రాభినయంలా ఉంటుంది !

అయితే.. ఆయన ఆమెతో

మాట్లాడేవన్నీ ఒట్టి అబద్దాలే!

అమెరికా నుంచి రాలేని కొడుకు

తన డూప్‌ని అద్దెకు తీసుకుని పంపాడని....

ఎలా చెబుతాడు మరి?

చనిపోయిన భార్య మరోసారి

గుండెపగిలి చనిపోదూ... అందుకే

కొన్ని అబద్దాలు చెప్పడం నేర్చుకుంటున్నాడు.

అందుకే... ఎవరైనా పలకరిస్తారని ..

మరెవరైనా ఒక్కసారిగా ఎదుట నిలబడి

తనని ఆశ్చర్యచకితుడ్ని చేస్తారని..

సాయంత్రం అస్తమించే ఒంటరి సూర్యుడులా

ఎదురుచూస్తున్న ఆయన్ని పలకరించాలి ..

బాగున్నారో లేదో కుశలం అడగాలి !

చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని రావాలి !

కమ్మని భోజనం వడ్డించాలి.

సాగనంపేటప్పుడు.. పరిమళాలు వెదజల్లే

గులాబీని కానుకగా ఇవ్వాలి.

ఆయనని హత్తుకుని

వెచ్చని భరోసా కౌగిలినివ్వాలి.

మళ్లీ ..మళ్లీ ఇంటికి రమ్మనాలి.. !

- గీతాంజలి

88977 91964



Next Story

Most Viewed