సూఫీ ఆలాపన ‘పేరులేని వెన్నెల’

by Disha edit |
సూఫీ ఆలాపన ‘పేరులేని వెన్నెల’
X

కొన్ని కథలు రచయిత ఫేస్‌బుక్ వాల్‌పై ఇదివరకు చదివినవే అయినా, ఇప్పుడు సైతం అంతే రసానుభూతిని కలిగించాయి. మంచి రచనకు ఇంతకు మించిన నిదర్శనం ఏంవుంటుందని! కథా నిర్మాణ రీతికి అతీతమైన కథలు కొన్ని ఉంటాయి. ఏ వ్యాకరణం నేర్చుకుని మాతృభాషలో మాట్లాడుతాం అలా.. వస్తువు తనంత తానుగా శైలిని ఎంచుకుంటుంది. చెప్పాలంటే, రచయితని కూడా! అయితే, రచయితకు రాసే రాత పట్ల నిబద్ధత ఉండాలి. అప్పుడే పఠితకు చేరువవుతుంది. 'పేరులేని వెన్నెల' కథా సంపుటి ఈ కోవకు చెందిందే.

కొత్తొక వింత పాతొక రోత! దీనికి విరోధాభాస సాహిత్యంలో కనిపిస్తుంది. పాత కాపులకు కొత్తతరం కనిపించదు. ఇంకా సమకాలీనులను గుర్తించకపోవడమనే విరోధ తత్వం ఎలాగూ ఏడ్చింది. అలాగే యువ రచయితల్ని, ‘నలభై ఏళ్ళు వస్తే గానీ జీవితం బోధ పడ’దని గట్టిగా నమ్మి, చిన్న చూపు చూస్తాం. ఇలాంటి పెదవి విరుపు మనసుతో నరేష్ కుమార్ సూఫీ కథా సంపుటి తిరిగేశా. ముందు మాటల్లేవ్.. గట్టోడే!. తనకు తానుగా పాఠకుడు అనుభూతి చెందే అవకాశం కల్పించినందుకు ఆనందించా.

‘పేరులేని వెన్నెల’ ఇదేం శీర్షిక! ‘వెన్నెలకు బొడ్డు కోసి పేరు పెడతారా’ అనుకుంటూ, చదువుతా చివరికంటా ఏకబిగిన వచ్చేసా. అప్పుడు ఊపిరి పీల్చుకుని, శీర్షిక ఔచిత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను. ముఖాన్ని చూసి వ్యక్తిని అంచనా వేసినట్లు, శీర్షికలను బట్టి కథను ఊహించలేమని నిర్ధారణ అయ్యింది. చివరి పేరాల్లో ప్రేమను గురించిన సంభాషణ చాలు, కథ ఔన్నత్యాన్ని విశదీకరించడానికి. త్యాగాలు కోరే ప్రేమ సినిమాలు చూస్తాం, ‘మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కాదా’ని పాటలు పాడుతాం.. నిజ జీవితంలో హత్యలు, యాసిడ్ దాడులు చేస్తాం. అటువంటి ప్రస్తుతంలో, “తనని ప్రేమిస్తే తనకు నచ్చినట్లు నేనెందుకు మారలేదు” అంటూ ప్రేమికుడు స్వగతంగా వేసుకునే ఈ ప్రశ్న, ఎడబారిన ఎందరిపైకో ఎక్కు పెట్టిన బాణం.

హరిశ్చంద్ర పద్య పాదం మకుటంగా ‘ఎన్నో యేండ్లు గతించి పోయినవీ,’ కానీ కులం మనుషుల్ని ఎందుకు వీడటం లేదో, ‘సమాధానం తెలిసీ పరిష్కారం మాత్రం దొరకని ప్రశ్న’గా ఎందుకు మిగిలివుందో తేట పరుస్తాడు. ‘కులవివక్ష కేవలం చదువుకోని వాళ్ల దగ్గరే అనే అభిప్రాయం అబద్ధమని’ తేల్చుతాడు. ఇది ప్రధాన అంశం. ఉప అంశంగా, ‘మతం మారినా కులం మార’దని రెండో ఇతివృత్తాన్ని సృజిస్తాడు. సామేల్ చనిపోవడం మీద విమర్శ ఉంది. “ఊరిడ్చి నే బోదునా! అయ్యో ఉరివెట్టుకు నే సస్తునా!” అని పాటగాడు ఎందుకు ఆక్రోశిస్తాడు? ఆ విలాప విమోచనాన్ని మనసుపెట్టి వినగలిగితే, మరణం అసాధారణమేమీ కాదని స్పష్టమవుతుంది.

‘సాజీదా అలియాస్ సల్మా’ కాలాలు మారినా మతం- ప్రేమను గుండె దాటనివ్వదని, మనుషుల్లో కులమతాల ప్రాధాన్యత పోలేదని బలంగా చెప్పే కథ. పాఠశాల ప్రేమిక సాజీదా, పెద్దయ్యాక సల్మాగా నాయకునికి ఎదురౌతుంది. ఆ ఇరువురు ఒక్కరేనా తెలుసుకునే అవకాశం ఉన్నా జారవిడుచుకుంటాడు. సందేహ నివృత్తిని పాఠకునికి వదిలేస్తాడు రచయిత. ‘కల’ గుండెల్లో తడి ఇరిగిపోని కార్పోరేట్ ఉద్యోగి నగరంలో ఇమడలేనితనాన్ని చెప్పే కథ. పచ్చని పల్లె జీవితాల్ని మైనింగ్ భూతం ఎలా విధ్వంసం చేస్తుందో చూపుతూ, ఎదుర్కొనే మార్గంగా తిరుగుబాటును సూచిస్తాడు. అది పరిష్కారం కావచ్చు, కాకపోనూవచ్చు అంటూనే “కొట్లాట మంచిది కాకపోవచ్చు. కానీ, కొట్లాడుడు మర్చిపోతే బతకలేం. ఎవడో వచ్చి సంపుడు గాదు, మనకు మనమే సంపుకున్నట్టే” అన్న తండ్రి మాటలు దారి దీపాలు. కల ఎత్తుగడగా కథను ప్రారంభించి, కలతో ముగిస్తాడు. కల నిజం కావాలని పాఠకుడూ కోరుకుంటాడు.

‘ఒక ఒమేగల్ కథ..’ ఇది పూర్తిగా న్యూ జనరేషన్ కథ. “సెక్స్ చాట్ చేసిన అమ్మాయిని ఫ్రెండ్‌గా, గాళ్ ఫ్రెండ్‌గా ఒప్పుకోలేవు. ఇలా ఎందరితో చాట్ చేసిందో అనే ఊహని కూడా భరించలేవు. అందుకని నీతో నాకే భయమూలేదు” అంటూ ప్రత్యేక్షంగా కలవడానికి అమ్మాయి ఒప్పుకున్నా, ఎదుటపడ్డ అబ్బాయి భయపడతాడు! ఎందుకన్నది కథ చదివి తెలుసుకోవాలి. ‘ఆలాపన’ కథ ఏకవాక్యంలో చెప్పాలంటే వేశ్యతో గడిపిన ఒక రాత్రి అనుభవం! ‘పెళ్లి ఓ బానిసత్వ ఒప్పందం’ అంటూ, మహోన్నత వైవాహిక వ్యవస్థని ఎండగడుతూ కథ నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

‘ఒక ముక్కోణపు ప్రేమకథ’ లోని ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్న శైలి, పాఠకుణ్ణి కథలో వాక్యం చేస్తుంది. చదివాకా - ‘ఈ ప్రపంచంలో ఉన్నవి ఆడా, మగా అనే రెండు జాతులు మాత్రమే అనుకునే ఆలోచన’ మారుతుంది. ‘మైనారిటీ వర్గంలో అసహనం, కోపం ఎందుకు ఉంటుంది దానికి కారణం ఎవరు’ ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. కన్నడ రచయిత వసుదేంద్ర ‘మోహన స్వామి’ నవల మూడో వారి పట్ల సానుభూతి కలిగిస్తే, ఈ కథ సహానుభూతి చూపేలా చేస్తుంది. నవల కంటే కథ ఎక్కువ ప్రభావవంతమైనది ఎందుకో అర్థమవుతుంది.

‘రహస్యం’ చిన్న కథ. రచయితగా ఎక్కడా ఏమీ చెప్పడు, సందేశం వినిపించడు. కానీ, కొసమెరుపు ముగింపు చదువరిని చకితుణ్ణి చేస్తుంది. ‘డంప్’ అంటే ఏంటో నాయకుని మనోభావం ద్వారా తెలుస్తుంది. తొమ్మిది కథల సంపుటికి విషయసూచిక లేకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. సిగరెట్లు చాయ్, కాఫీ, లిక్కర్ లాంటి పదాలు విరివిగా వాడటం వలన ఏ కథకు ఆ కథగా చదివినపుడు బాగున్నా, సంపుటిలో పునరుక్తిలా తోస్తుంది. రచయిత వ్యక్తిగత జీవితం కొంత తెలిసి ఉండడం, ఉత్తమ పురుష అభివ్యక్తి వలన కథలు చాలా వరకు తన గురించి చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ, సంగీతం, సాహిత్యం, సినిమా పాటల ఉటంకింపు పాండిత్య ప్రదర్శనలా ఉండదు. కథలో భాగంగా హాయిగా సాగిపోతుంది.

పుస్తకం: పేరులేని వెన్నెల

రచయిత: నరేష్ కుమార్ సూఫీ

పుటలు:135

వెల:రూ. 150

ప్రచురణ : ఛాయ ప్రచురణలు - 70931 65151

సమీక్షకులు

పిన్నంశెట్టి కిషన్

97002 30310



Next Story

Most Viewed