- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జీవగడ్డ’ జ్ఞాపకాలు నులిపెడతాయి
నాలుగు దశాబ్దాల క్రితం కరీంనగర్ నుండి వెలువడ్డ ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రిక నాకు అనేక కళల్ని పరిచయం చేసింది, కలలు కనడానికి నేర్పింది. కాలాన్ని అర్థం చేసుకోవడాన్ని నేర్పింది.

నాలుగు దశాబ్దాల క్రితం కరీంనగర్ నుండి వెలువడ్డ ‘జీవగడ్డ’ సాయంకాలపు దినపత్రిక నాకు అనేక కళల్ని పరిచయం చేసింది, కలలు కనడానికి నేర్పింది. కాలాన్ని అర్థం చేసుకోవడాన్ని నేర్పింది. పత్రికలో ‘కాలం’ రాయడాన్ని నేర్పింది. స్నేహాన్ని ప్రేమని పరిచయం చేసి ఒక సామూహిక తత్వాన్ని అలవాటు చేసింది.
కాలగమనంలో అనేకమంది మిత్రులు సెలవంటూ తరలి వెళ్ళిపోయారు. ఇంకొందరయితే చెప్పాపెట్టకుండానే సెలవు తీసుకున్నారు. వాళ్ళందరి జ్ఞాపకాలు, చర్చలు, వాదవివాదాలు అన్నీ మనసుని నులిపెడుతూనే వున్నాయి. పోయిన వారు పోగా మిగిలిన మిత్రులు అప్పుడప్పుడూ కలుస్తాం మాట్లాడుకుంటాం. “రోజూ కలిస్తేనే స్నేహాలుంటాయా”. కానీ జీవగడ్డ నా స్మృతిలో ఎప్పుడూ సజీవమే.
‘జీవగడ్డ’- ఆత్మీయ సృజనాత్మక వేదిక..
ఇక 1984-85లు ఆ తర్వాతి కాలం నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎంతగానో ప్రభావితం చేసిన కాలమది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో సాహితీ సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల చైతన్యం పెల్లుబికిన కాలమది. పల్లెలన్నీ అతలాకుతలమవుతూ తమ దారిని నిర్దేశించుకుంటున్న సమయమది. అదే సమయంలో నగరాలూ కరీంనగర్ లాంటి పట్టణాలూ కూడా చైతన్య జెండాల్ని అందుకున్నాయి. మధ్యతరగతి ప్రజల్లో అభిమానం ఆదరణ పెల్లుబికాయి. అప్పటికింకా నేనూ నాదీ నాకేమిటి అన్న భావన అంకురించలేదు. మనమూ మనదీ అన్న భావనతో పాటు ఒక అనిర్వచనీయమైన సామజికత్వం, సామూహికత్వం కనిపించేది.
చైతన్యవంత విలేఖరులపై దృష్టి..
ఆ నేపధ్యంలోనే కరీంనగర్‌లో ‘జీవగడ్డ’ సాయంకాల దిన పత్రిక మొదలయింది. అందరమూ విజ్జన్న అని ఆప్యాయంగా పిలిచే బి.విజయకుమార్ దాని సంపాదకుడు, వ్యవస్థాపకుడు. అప్పటికే ఒకసారి పోలీసుల నిర్బంధాన్ని, హింసని చవిచూసిన వాడు. అయినా ఎంతో సరదాగా స్నేహంగా చైతన్యవంతంగా ఉండేవాడు. అప్పుడు జిల్లా కేంద్రంలో ఒక పత్రిక పెట్టాలనే ఆలోచన చేసి, అన్ని మండలాల్లో యువకులు సానుభూతిపరుల్ని విలేఖరులుగా నియమించాలి అన్నది విజయకుమార్‌తో పాటు రచయిత బి.ఎస్.రాములు ఆలోచన. అయితే బీ.ఎస్. ప్రతిపాదించిన జీవగడ్డకు అనుమతి వచ్చింది. కానీ అప్పటికే ఆయన ప్రజా జీవితంలోకి వెళ్లి పోయాడు. దాంతో విజయ కుమార్ ‘జీవగడ్డ’ను ఆరంభించాడు.
జీవగడ్డ మొదలైన వేళ..
కరీంనగర్ శాస్త్రీ రోడ్‌కు కింది భాగాన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర బ్రాహ్మణ వాడలో పత్రిక షురూ అయింది. శారదా ప్రింటింగ్ ప్రెస్ యజమాని నాగభూషణం తన ప్రెస్‌లో అచ్చువేయడానికి ముందుకు వచ్చాడు. అట్లా సాయంకాలం దిన పత్రికగా మొదలైంది. అప్పటికి లెటర్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే ఉండేది. అప్పుడే అసిస్టెంట్ ఎడిటర్‌గా కే.ఎన్.చారి రంగ ప్రవేశం చేసాడు. ఉస్మానియాలో పీజీ చేసి కవిత్వం, జర్నలిజంల పట్ల ఆసక్తితో జీవగడ్డలో చేరాడు. నేను కలిసిన మొదటి రోజే ‘హాయ్ ఆనంద్. మనిద్దరికీ ఇంతకు ముందు పరిచయం లేదు కానీ ఇద్దరం ఉస్మానియా రైటర్స్ సర్కిల్‌లో పనిచేశాం. అంటే మనం పాత వాళ్లమే’ అన్నాడు. అట్లా సులభంగా కలిసిపోయాం.
స్టూడెంట్ చక్రపాణి.. ఘంటా చక్రపాణి అయ్యాడు
అప్పుడే ప్రజా జీవితం నుంచి వచ్చి ఉస్మానియాలో ఎం.ఏ సోషియాలజీ పూర్తి చేసిన కవి అల్లం నారాయణ సబ్ ఎడిటర్‌గా జీవగడ్డలో చేరాడు. ఇక క్రికెట్ అంటే విపరీతమైన అభిమానంతో పాటు క్రికెట్ ఆడే యువకుడు నరేందర్ రావుని స్పోర్ట్స్ రాయమని చారి బాగా ప్రోత్సహించారు. దాదాపు అదే సమయంలో ఘంటా చక్రపాణి కరీంనగర్‌లో ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో విద్యార్థి. సాయంకాలాలు విద్యార్థి సంఘ ప్రకటనలు తీసుకుని జీవగడ్డ ఆఫీసుకు వచ్చేవాడు. క్రమంగా అది గమనించిన చారి ఒక రోజు ‘ఏయ్ ఆగు’ అని చక్రపాణిని ఆపాడు. ఈ ప్రకటనల్ని ఎవరు రాస్తారు అని అడిగాడు. నేనే అన్నాడు చక్రపాణి. అయితే ఇట్లా కూర్చుని ఇది రాయి అంటూ ఒక ప్రకటన ఇచ్చాడు. రాయగానే ఇక రోజూ సాయంత్రం రా.. ఇక్కడ కూర్చుని రాయి అని ఓ పెద్దన్న చెప్పినట్టు చెప్పాడు. ఏముంది స్టూడెంట్ చక్రపాణి కాస్తా ఘంటా చక్రపాణి అయిపోయాడు.
చారి ప్రేరేపించిన కాలమ్ రైటింగ్
అప్పటిదాకా ఫిలిం సొసైటీ అడ్డా ఎడమ నారాయణ రెడ్డి ‘లక్ష్మి సానిటరీ’. దాన్నుండి క్రమంగా జీవగడ్డకు మారింది. అక్కడా ఇక్కడా వుండేవాళ్ళం. పగలయితే లక్ష్మి సాయంత్రమైతే జీవగడ్డ. ఒకరా ఇద్దరా ఎంతమందని. ఓహ్.. నరేడ్ల శ్రీనివాస్, నారదాసు లక్ష్మణరావు, గోపు లింగా రెడ్డి, పెండ్యాల సంతోష్ కుమార్, కే.దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పీజీ సెంటర్ జే.మనోహర్ రావు, లెక్చరర్ డి.నరసింహారావు, కే.విజయ్, సి.పుల్లయ్య, అన్నా రెడ్డి, జాప లక్ష్మా రెడ్డి ఇట్లా అనేక మంది దాదాపు రోజూ కలిసేవాళ్ళం. అనేక చర్చలు వాదాలూ వివాదాలూ కొనసాగేవి. ఒక రోజు చారికి ఒక ఆలోచన వచ్చింది. ఇట్లా రోజూ వూరికే కలవడం మాట్లాడడమే కాదు అందరూ ఏమైనా రాయాలి అన్నాడు. ఏమిటి ఎట్లా అన్నం. ఒక్కొక్కరూ ఒక్కో రోజు జీవగడ్డలో కాలం రాయాలి అన్నాడు. ఎడిటర్ విజ్జన్న బాగుంటుంది రాయండి అన్నాడు. ఇంకేముంది. శీర్షికలూ, రాయాల్సిన రోజులూ చారి నిర్ణయించేసాడు. రాయాల్సిన వాళ్ళ పేర్లూ చెప్పేసాడు. సోమవారం గోపు లింగా రెడ్డి ‘జానపదం’, మంగళవారం నరెడ్ల శ్రీనివాస్ ‘వెన్నుపోటు’, బుధవారం చారి ‘న్యాయ వాదం’, శుక్రవారం అల్లం నారాయణ ‘ఎన్నెల కోనల్లో’ రాయాలన్నాడు. బాగుందన్నాం. నువ్వెట్లా తప్పించుకుంటావన్నాడు చారి. ఆదివారం ‘వారానందం’ రాయాలన్నాడు. ఏముంది సరే నన్నాను. అప్పటికే నేను కొంత కవిత్వం మరికొంత సమాంతర సినిమాల మీద రాస్తున్నవాన్ని. చారి దానికదే.. దీనికిదే అన్నాడు.
మా చర్చలకు ఉత్తమ వేదిక
ఆ రకంగా ఒక దిన పత్రికలో వారం వారం కాలం రాయడం, రాసే అవకాశం రావడం అప్పటికి గొప్ప విషయమే. ఆ ఘనత అంతా కే.ఎన్ చారీ, విజయకుమార్ లదే. జీవగడ్డకు క్రమం తప్పకుండా జాప లక్ష్మా రెడ్డి వచ్చేవారు. ఇంకా న్యాయవాదులు గులాబీల మల్లారెడ్డి, గుణవంత్ సింగ్, గోపు రాజిరెడ్డి కూడా వచ్చేవారు. ‘జీవగడ్డ’ మా అందరి స్నేహాలకూ, కళాత్మక రాజకీయ చర్చలకూ ఉత్తమ వేదికగా మారింది. అంతే కాదు కరీంనగర్ ఫిలిం సొసైటీ కొత్త కార్యక్రమాలకూ, వాటి రూపకల్పనకూ జీవగడ్డ ఊతమిచ్చింది. ఇంకా “కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్” అన్న ఆలోచనకూ వేదికయింది.
(నా 'యాదొంకి బారాత్' నుండి)
-వారాల ఆనంద్
94405 01281






