సమీక్ష:డా. మడత మది దర్పణం

by Disha edit |
సమీక్ష:డా. మడత మది దర్పణం
X

బాల్యంలో చూసిన సంఘటనలు, తండ్రి కలిగించిన ప్రేరణ కలబోతతో, తనదైన పరిశోధక దృష్టి కోణంతో వెలువరించిందే డాక్టర్ మడత భాస్కర్ 'పైసల చెట్టు' కవితా సంపుటి. తెలుగు సాహిత్య వైభవ ప్రచారమే లక్ష్యంగా సాగుతున్న ఈ కవి సర్వాయి పాపన్న సంతతి వర్గీయుడు. సామాజిక స్పృహ పోరాట పటిమ మెండుగా ఇతనిలో కనిపిస్తాయి. ఆ ఆలోచన ధోరణిలో సాగిన ఈ కవితా మణిహారంలో మొత్తం 38 కవితా మణులు ఉన్నాయి. పతాక శీర్షిక అయిన కవిత ఆసాంతం తన అనుభవ జ్ఞాపకాల దొంతర. 'పైసల చెట్టు' మరెవరో కాదు తనకు జన్మనిచ్చిన తండ్రి. భాస్కర్ స్వతహాగా హాస్య చతురుడు. నవ్వకుండా నవ్వించే గొప్ప నవ్వుల రేడు. అయినా, సమాజంలోని దుర్నీతి, కపట ప్రేమ పట్ల ధర్మాగ్రహం చూపుతాడు. అన్యాయం పాలైన అభాగ్యుల పక్షాన ప్రతిస్పందించి మానవత్వం నిరూపించుకుంటాడు.తన మాతృభాష, వృత్తి భాష పట్ల తరగని ప్రేమాభిమానాలు పొదుపుకుంటారు. తన జన్మభూమి అయిన తెలంగాణ బంగారు భవితను కోరుకుంటాడు. తనలో మచ్చుకు కూడా కనిపించని ప్రణయ విరహ వేదన మూలాలను మురిపంగా ఆరబోస్తాడు. అది కూడా సామాజిక స్పృహ కోణంలోనే.

'వస్తువు ఏదైనా చిక్కని కవిత సొగసులద్దగలవారే చక్కని కవులు' అన్న భావనను తన ప్రతి కవితలో ఆవిష్కరించిన డా. భాస్కర్ కవితా ప్రతిభ శతశాతం ప్రశంసనీయం. 'అమ్మ ఆప్యాయతకు చిరునామా అయితే తండ్రి త్యాగానికి విలాసం' అన్న సత్యం చెబుతూనే 'నీతి నిజాయితీలనే నీరు పోసి / మంచి మానవత్వం అనే ఎరువు వేసి / చదువు సంస్కారం అనే కంచె పేర్చి / చివరికి నువ్వు పెంచిన / పైసల చెట్టు నేనేనని తెలుసుకున్న / కుటుంబ భారాన్ని మోసిన నీ త్యాగం ఖరీదు కట్టడానికి ఈ భూమి మీద ఏ పైసల చెట్టు సరిపోదు' అంటూ తండ్రి పాత్రను ఆకాశమంతగా వర్ణిoచుకుంటాడు. శ్రామికుల శ్రమ సౌందర్యం గురించి ఆలోచింపజేసే కవిత 'గూడెప్పాడ్ కూడలి' ఇక నేటి కాలపు యువత పెడదారి పోకడలకు 'రెడీమేడ్ పెళ్లిళ్లు' కవితలో చిరు హాస్యపు పూతలతో సుతిమెత్తని చురకల వైద్యం చేస్తాడు. తన జాతి ఆత్మగౌరవాన్ని చంకనేసుకుని తనకు భృతి కలిగిస్తున్న తన 'వృత్తి భాష' పట్ల కూడా అధికంగా ప్రతిస్పందించారు. 'తెలుగు తోరణం, విశ్వభాష తెలుగు, తెలుగు వైభవం, ఆచార్యదేవోభవ, తెలుగు పండితుడా వందనం, వంటి కవితలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

ప్రతి కవిత అందంగా, హాయిగా, చదివిస్తూ పాఠకులకు చక్కని సంతృప్తిని పంచుతూ సాగింది. కవిత్వంలో నానుడులు, పదాలకూర్పు, ప్రారంభం, ముగింపులతో పాటు ఎంచక్కని ఎత్తుగడలు, ఈ కవితా సంపుటికి అదనపు సంపదలు, చివరగా ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్న నానుడిని వదలకుండా, సంధ్య లేని / భాస్కరోదయం ఎక్కడిది? / సంధ్య రాని / భాస్కరుడికి పూర్ణత్వం ఎక్కడిది?' అని ప్రశ్నిస్తూ తన శ్రీమతి శ్రమకు అభినందన అక్షరమాల వేస్తాడు ఈ చిలిపి చెనుణుకుల భాస్కరుడు. గంభీర విషయాన్ని ప్రశాంత వదనంతో చూడటం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు చదవదగిన చక్కని కవితా సంపుటి ఇది.

ప్రతులకు:

డాక్టర్ మడత భాస్కర్

89193 28582

పేజీలు 130 , వెల: రూ.100/-

సమీక్షకులు:

డా: అమ్మిన శ్రీనివాసరాజు

7729883223.

Next Story

Most Viewed